
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్(LSG) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(Kane Williamson)తో ఎల్‌ఎస్‌జీ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే విలియమ్సన్ లక్నో జట్టులో ప్లేయర్‌గా కాదు.. స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా చేరనున్నాడంట. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఓనర్ సంజీవ్ గోయెంకా సూచన మెరకు లక్నో టీమ్ మెనెజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఐపీఎల్-2022 సీజన్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్.. ఇప్పటివరకు నాలుగు ఎడిషన్లను పూర్తి చేసుకుంది. కానీ యాజమాన్యం అంచనాలను అందుకోవడంలో సూపర్ జెయింట్స్ విఫలమైంది. మొదటి రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కి చేరిన లక్నో.. ఆ తర్వాతి రెండు ఎడిషన్‌లలో ఏడో స్ధానానికి పరిమితమైంది.
మొదట గౌతమ్ గంభీర్, మోర్నే మోర్కెల్ కోచింగ్ స్టాఫ్‌లో ఉండగా ఇప్పుడు జస్టిన్ లాంగర్ ప్రధాన కోచ్‌గా ఉన్నారు. అయితే గత సీజన్‌లో తమ జట్టు మెంటార్‌గా పనిచేసిన టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌పై ఎల్ఎస్‌జీ వేటు వేసింది.
అంతేకాకుండా ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు తమ బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ భరత్ అరుణ్‌ను లక్నో నిమమించింది. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కార్ల్ క్రోవ్ లక్నో స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
గత రెండు సీజన్లలో గ్రూపు స్టేజికే పరిమితమైన తమ జట్టును కేన్ మామ తన అనుభవంతో విజయం పథంలో నడిపిస్తాడని లక్నో భావిస్తోంది. లక్నోలో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. మార్‌క్రమ్, మార్ష్, పంత్, పూరన్ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉన్నప్పటికి.. బౌలింగ్ యూనిట్ మాత్రం వారికి తలనొప్పిగా మారింది.
గత సీజన్‌లో మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్ వంటి పేసర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కనీసం కేన్ రాకతో నైనా లక్నో తలరాత మారుతుందో లేదో వేచి చూడాలి. విలియమ్సన్ చివరగా ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు.
చదవండి: IND vs AUS: ఆసీస్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! మ్యాచ్ విన్నర్‌కు నో ఛాన్స్?