
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలు దేరింది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో పెర్త్ వేదికగా అక్టోబర్ 19న తొలి వన్డేలో భారత్-అసీస్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
శుభ్‌మన్ గిల్(Shubman Gill) సారథ్యంలో తొలిసారి భారత్ వన్డేల్లో ఆడనుంది. రోహిత్ శర్మ (Rohit sharma) స్ధానంలో గిల్‌ను టీమిండియా వన్డే కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లగా జట్టును నడిపించిన హిట్‌మ్యాన్ ఇకపై కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. అతడితో పాటు విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే ఆసీస్‌తో తొలి వన్డేలో కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎటువంటి వ్యూహాలతో బరిలోకి దిగుతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో పెర్త్ వన్డే కోసం భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎంచుకున్నాడు. ఓపెనర్లగా శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలను ఎంపిక చేశాడు.. ఆ తర్వాత మూడు నాలుగు స్ధానాల్లో వరుసగా విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.
కేఎల్ రాహుల్ ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు రావాలని చోప్రా సూచించాడు. గాయం కారణంగా ఆసీస్ టూర్‌కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా స్ధానంలో నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో ఆకాష్ చోప్రా అవకాశమిచ్చాడు. అదేవిధంగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు చోటిచ్చాడు.
ఇటీవల కాలంలో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రాణిస్తున్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మాత్రం చోప్రా ఎంచుకున్న జట్టులో చోటు దక్కలేదు. మ్యాచ్ విన్నర్ అయిన కుల్దీప్‌ను పక్కన పెట్టడానికి గల కారణాన్ని అయితే అతడు వెల్లడించలేదు. ముగ్గురు పేసర్లకు తన జట్టులో అతడు ఛాన్స్ ఇచ్చాడు. హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లు ఫాస్ట్ బౌలర్లగా ఉన్నారు.
నితీష్ రూపంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఉన్నప్పటికి చోప్రా హర్షిత్ రాణాకు మూడో పేసర్ అవకాశమివ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. కాగా ఆసీస్‌తో వన్డేలకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్‌లో మాత్రం ఈ పేస్ గుర్రం ఆడనున్నాడు.
చోప్రా ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్,హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: 20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ