పంజాబ్‌ పరుగుల పండగ | Lucknow lost to Punjab Kings by 54 runs | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ పరుగుల పండగ

Apr 20 2026 4:14 AM | Updated on Apr 20 2026 4:14 AM

Lucknow lost to Punjab Kings by 54 runs

శ్రేయస్‌ బృందం ఐదో విజయం

దంచికొట్టిన ప్రియాన్ష్, కూపర్‌

54 పరుగుల తేడాతో లక్నో ఓటమి

గత నాలుగు మ్యాచ్‌ల్లో లక్ష్యఛేదనలో సత్తా చాటిన పంజాబ్‌ కింగ్స్‌...  ఈసారి మొదట బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. లక్నో బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఈ సీజన్‌లో అత్యధిక స్కోరును తమ పేరిట లిఖించుకుంది. ప్రియాన్ష్ ఆర్య, కూపర్‌ కనొలీ పోటీపడి సిక్స్‌లు కొట్టడంతో పంజాబ్‌ కొండంత స్కోరు చేయగా... ఛేదనలో పలు ప్రయోగాలు చేసిన లక్నో విజయానికి 54 పరుగుల దూరంలో నిలిచిపోయింది.  

న్యూ చండీగఢ్‌: ఐపీఎల్‌ 19వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జోరు సాగుతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ముందుకు సాగుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని పంజాబ్‌ తమ ఖాతాలో ఐదో విజయం వేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్‌ 54 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను మట్టికరిపించింది. 

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (37 బంతుల్లో 93; 4 ఫోర్లు, 9 సిక్స్‌లు), కూపర్‌ కనోలీ (46 బంతుల్లో 87; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 80 బంతుల్లోనే 182 పరుగులు జోడించడం విశేషం. లక్నో బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్, సిద్ధార్థ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 

అనంతరం లక్ష్యఛేదనలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులకు పరిమితమైంది. మిచెల్‌ మార్ష్  (28 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్‌ బదోనీ (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కెపె్టన్‌ రిషభ్‌ పంత్‌ (23 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్‌లు), మార్క్‌రమ్‌ (22 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. సాధించాల్సిన లక్ష్యం మరీ ఎక్కువగా ఉండగా... లక్నో ఏ దశలోనూ ఆ వేగం అందుకలోకపోయింది. పంజాబ్‌ బౌలర్లలో యాన్సెన్‌ 2 వికెట్లు తీశాడు. 

ధనాధన్‌.. 
ఈ సీజన్‌లో తొలిసారి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌... లక్నో బౌలర్లపై తమ ప్రతాపం చూపింది. ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (0)ను షమీ తొలి ఓవర్‌లోనే అవుట్‌ చేయగా... అక్కడి నుంచి పంజాబ్‌ ఊచకోత మొదలైంది. మరో ఓపెనర్‌ ప్రియాన్ష్ ఆర్య, కూపర్‌ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్‌లతో విరుచుకుపడ్డారు. ఆరో ఓవర్‌లో ఆర్య 4, 6, 6 బాదగా... పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్‌ 63/1తో నిలిచింది. 

బదోనీ ఓవర్‌లో కూపర్‌ 4, 6 కొట్టగా... ఆర్య 19 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. షమీ ఓవర్‌లో రెండు సిక్స్‌లతో కూపర్‌ కూడా హాఫ్‌సెంచరీ మార్క్‌ దాటాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా ఈ జోడీ దంచి కొట్టడంతో పంజాబ్‌ స్కోరు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. మార్క్‌రమ్‌ వేసిన 13వ ఓవర్‌లో అయితే ఈ ఇద్దరు పండగ చేసుకున్నారు. తొలి మూడు బంతులను కూపర్‌ సిక్స్‌లుగా మలిస్తే... చివరి రెండు బంతులకు ఆర్య సిక్స్‌లు కొట్టాడు. దీంతో 32 పరుగులు వచ్చాయి. 

ఫలితంగా 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ 179/1తో మరింత భారీ స్కోరు చేసేలా కనిపించింది. ఆఖర్లో కాస్త తేరుకున్న లక్నో బౌలర్లు ఈ ఇద్దరితో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ (5), నేహల్‌ వధేరా (13) వికెట్లు తీసి పరుగుల వేగాన్ని నియంత్రించారు. స్టొయినిస్‌ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్‌ సింగ్‌ (6 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్‌లు) చివర్లో ధాటిగా ఆడారు. 

స్కోరు వివరాలు 
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ ఆర్య (సి) మార్ష్  (బి) సిద్ధార్థ్‌ 93; ప్రభ్‌సిమ్రన్‌ (సి) మార్ష్  (బి) షమీ 0; కూపర్‌ (సి) సిద్ధార్థ్‌ (బి) ప్రిన్స్‌ 87; శ్రేయస్‌ (సి) షమీ (బి) మొహసిన్‌ 5; స్టొయినిస్‌ (రనౌట్‌) 29; వధేరా (సి) పూరన్‌ (బి) సిద్ధార్థ్‌ 13; శశాంక్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) ప్రిన్స్‌ 17; యాన్సెన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–3, 2–185, 3–187, 4–193, 5–208, 6–252, 7–254. బౌలింగ్‌:  షమీ 4–0–56–1; మొహసిన్‌ 4–0–43–1; ప్రిన్స్‌4–0–25–2; బదోనీ 1–0–14–0; అవేశ్‌ 3–0–46–0; సిద్ధార్థ్‌ 3–0–35–2; మార్క్‌రమ్‌ 1–0–32–0.  

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్ష్  (సి) బార్ట్‌లెట్‌ (బి) చాహల్‌ 40; బదోనీ (సి) బార్ట్‌లెట్‌ (బి) వైశాక్‌ 35; పంత్‌ (సి) ప్రభ్‌సిమ్రన్‌ (బి) అర్ష్ దీప్‌ 43; పూరన్‌ (సి) శ్రేయస్‌ (బి) యాన్సెన్‌ 9; మార్క్‌రమ్‌ (సి) స్టొయినిస్‌ (బి) యాన్సెన్‌ 42; ముకుల్‌ (నాటౌట్‌) 21; హిమ్మత్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–61, 2–109, 3–128, 4–139, 5–199. బౌలింగ్‌: అర్ష్ దీప్‌ 4–0–41–1; బార్ట్‌లెట్‌ 4–0–54–0; యాన్సెన్‌ 4–0–37–2; వైశాక్‌ 4–0–30–1; చాహల్‌ 4–0–36–1.  

ఐపీఎల్‌లో నేడు
గుజరాత్‌ X ముంబై  
వేదిక: అహ్మదాబాద్‌
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
 
Advertisement
Advertisement