
PC: LA28 X
తొలిసారిగా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో సేవలు
లాస్ ఏంజెలిస్: వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒలింపిక్స్ క్రీడల్లో ఇప్పటి వరకు ఆటగాళ్లు, ప్రేక్షకులు, వీఐపీలు కార్లు, బస్సుల్లోనే వేదికలకు చేరేవారు. కానీ లాస్ ఏంజెలిస్‌లో 2028లో జరిగే విశ్వక్రీడలు ‘విహంగ విహారానికి’ సిద్ధమవుతున్నాయి. మరో మూడేళ్లలో అమెరికాలోని ప్రఖ్యాత నగరంలో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో ‘ఎయిర్ ట్యాక్సీ’లను వినియోగిస్తామని ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.
ఆటగాళ్లు, వీఐపీలే కాదు... సాధారణ ప్రేక్షకులు సైతం విహంగ విహారం చేస్తూ ఆయా వేదికలకు చేరుకుంటారు. విశ్వక్రీడల్లో ఈ తరహా ఎయిర్ ట్యాక్సీలు నిర్వహించనుండటం చరిత్రలోనే తొలిసారి కానుంది. తద్వారా ఎవరికీ ప్రయాణ బడలిక లేకుండా కేవలం పది నుంచి 20 నిమిషాల్లోపే వేదికలకు చేరవేయవచ్చని నిర్వాహకులు ప్రణాళికలతో ఉన్నారు.
సోఫీ స్టేడియం, లాస్ ఏంజెలిస్ మెమోరియల్ కొలిజియం, శాంటా మోనికా, ఆరెంజ్ కౌంటీ, హాలీవుడ్ వేదికలకు ఎయిర్ ట్యాక్సీలను వినియోగించే ఆలోచనతో ఉన్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ సీఈఓ ఆడమ్ గోల్డ్‌స్టెయిన్ తెలిపారు. అమెరికా భవిష్య ప్రయాణ ముఖచిత్రాన్నే లాస్ ఏంజెలిస్ విశ్వక్రీడలు మార్చబోతున్నాయని చెప్పారు.
ఇదీ చదవండి: ఫైనల్లో అల్‌కరాజ్
రోమ్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్‌కరాజ్ తన కెరీర్‌లో 25వ టోరీ్నలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అల్‌కరాజ్ 6–3, 7–6 (7/4)తో లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై విజయం సాధించాడు. 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్ ఒక ఏస్ సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.
తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఈ ఏడాది నాలుగో టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన అల్‌కరాజ్ రెండు టోర్నీల్లో (మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్; రోటర్‌డామ్ ఓపెన్) విజేతగా నిలిచి, బార్సిలోనా ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. యానిక్ సినెర్ (ఇటలీ), టామీ పాల్ (అమెరికా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో అల్‌కరాజ్ తలపడతాడు.