చరిత్ర సృష్టించిన లార్డ్స్‌ మైదానం | Lords becomes first venue to host 150 Tests | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన లార్డ్స్‌ మైదానం

Jun 4 2026 6:23 PM | Updated on Jun 4 2026 6:33 PM

Lords becomes first venue to host 150 Tests

క్రికెట్‌కు మక్కాగా పేరొందిన ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌ క్రికెట్‌ మైదానం మరో అరుదైన ఘనత సాధించింది. 1884లో తొలి టెస్టు మ్యాచ్‌కు వేదికైన ఈ చారిత్రక మైదానం.. ఇవాళ ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య ప్రారంభమైన టెస్టుతో 150 టెస్టు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెట్ మైదానంగా చరిత్ర సృష్టించింది.

లార్డ్స్‌ తర్వాత అత్యధిక టెస్ట్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన మైదానంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు 118 టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఆతర్వాతి స్థానంలో ఆస్ట్రేలియాకే చెందిన సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ ఉంది. ఈ మైదానం ఇప్పటివరకు 114 టెస్ట్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ఆతర్వాతి స్థానంలో ఇంగ్లండ్‌లోని ద ఓవల్‌ గ్రౌండ్‌ ఉంది.  ఈ మైదానంలో ఇప్పటివరకు 108 టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగాయి.

కాగా, లార్డ్స్‌లో ఇప్పటివరకు జరిగిన 150 టెస్ట్‌ల్లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు ఏకంగా 146 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 60 విజయాలు, 35 పరాజయాలు, 51 డ్రాలు నమోదు చేసింది. ముఖ్యంగా యాషెస్‌ సిరీస్‌లో ఎన్నో క్లాసిక్‌ మ్యాచ్‌లు ఈ మైదానంలో జరిగాయి.

దాదాపు 2.5 మీటర్ల వంపు (Slope) కలిగిన ప్రత్యేకత లార్డ్స్‌కు మాత్రమే ఉంది. మ్యాచ్‌ ప్రారంభ రోజున పేసర్లకు అనుకూలించే ఈ పిచ్‌ క్రమంగా ఎండిపోతూ స్పిన్నర్లు, బ్యాటర్లకు కూడా సహకరిస్తుంది.

ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా ఇవాళ మొదలైన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. వరుణుడి ఆటంకాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోయింది. 

అరంగేట్రం బ్యాటర్‌ ఎమిలియో గే 8 పరుగులు చేసి జేమీసన్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 11.2 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ 31-1గా ఉంది.బెన్‌ డకెట్‌ 19, జేకబ్‌ బెతెల్‌ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.

న్యూజిలాండ్‌: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రాచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, విలియం ఓ'రూర్క్

ఇంగ్లండ్: ఎమిలియో గే, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్(కెప్టెన్), గస్ అట్కిన్సన్, ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్, షోయబ్ బషీర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement