భళా బొయిసన్‌... | Lois Boisson advances to semifinals at French Open | Sakshi
Sakshi News home page

భళా బొయిసన్‌...

Jun 5 2025 2:00 AM | Updated on Jun 5 2025 2:00 AM

Lois Boisson advances to semifinals at French Open

ప్రపంచ ఆరో ర్యాంకర్‌ ఆంద్రీవాపై సంచలన విజయం

ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలోనే సెమీఫైనల్‌కు అర్హత 

పారిస్‌: టెన్నిస్‌ సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో మరో సంచలనం నమోదైంది. ‘వైల్డ్‌ కార్డు’తో ఈ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ 361వ ర్యాంకర్, ఫ్రాన్స్‌ ప్లేయర్‌ లూయి బొయిసన్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో అన్‌సీడెడ్‌ బొయిసన్‌ 7–6 (8/6), 6–3తో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ మిరా ఆంద్రీవా (రష్యా)ను బోల్తా కొట్టించింది. 

తద్వారా 1989 తర్వాత కెరీర్‌లో ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలోనే సెమీఫైనల్‌కు చేరుకున్న ప్లేయర్‌గా బొయిసన్‌ గుర్తింపు పొందింది. చివరిసారి 1989లో మోనికా సెలెస్‌ (యుగోస్లావియా), జెన్నిఫర్‌ కాప్రియాటి (అమెరికా) ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనే ఈ ఘనత సాధించారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా)ను ఓడించిన బొయిసన్‌ క్వార్టర్‌ ఫైనల్లోనూ అదే జోరు కనబరిచింది. 

2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 22 ఏళ్ల బొయిసన్‌ మూడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ కోకో గాఫ్‌ (అమెరికా)తో బొయిసన్‌ తలపడుతుంది. మరో క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ కోకో గాఫ్‌ 6–7 (6/8), 6–4, 6–1తో ఏడో సీడ్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా)పై గెలిచింది.  

సెమీస్‌లో అల్‌కరాజ్, సినెర్‌ 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సినెర్‌ 6–1, 7–5, 6–0తో అలెగ్జాండర్‌ బుబ్లిక్‌ (కజకిస్తాన్‌)పై, అల్‌కరాజ్‌ 6–0, 6–1, 6–4తో 12వ సీడ్‌ టామీ పాల్‌ (అమెరికా)పై విజయం సాధించారు. సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్‌ ముసెట్టి (ఇటలీ)తో అల్‌కరాజ్‌ ఆడతాడు. జొకోవిచ్‌ (సెర్బియా), జ్వెరెవ్‌ (జర్మనీ) మధ్య చివరి క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో రెండో సెమీఫైనల్లో సినెర్‌ తలపడతాడు.  

Advertisement
 
Advertisement
Advertisement