Mohammad Kaif : వయసు పెరిగినా వన్నె తగ్గలేదు..

LLC 2023:Mohammad Kaif Takes Stunning Catches Looks-Like-Vintage Player - Sakshi

మహ్మద్‌ కైఫ్‌.. టీమిండియా క్రికెట్‌లో మేటి ఫీల్డర్‌గా గుర్తింపు పొందాడు. బ్యాటింగ్‌ కంటే తన ఫీల్డింగ్‌ విన్యాసాలతోనే జట్టులో ఎక్కువకాలం కొనసాగాడు. కైఫ్‌ ఫీల్డ్‌లో ఉంటే అతని వైపు వచ్చిన బంతి అతన్ని దాటుకొని వెళ్లడం అసాధ్యం. ఎన్నోసార్లు తన మెరుపు ఫీల్డింగ్‌తో అలరించిన కైఫ్‌ అద్భుతమైన ‍క్యాచ్‌లు కూడా చాలానే తీసుకున్నాడు. 2002-06 మధ్యలో టీమిండియా తరపున కైఫ్‌ 13 టెస్టులు, 125 వన్డేలు ఆడాడు.

తాజాగా  లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో భాగంగా వింటేజ్‌ కైఫ్‌ను తలపించాడు. శనివారం ఆసియా లయన్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కైఫ్‌ మూడు క్యాచ్‌లు తీసుకున్నాడు. ఇందులో రెండు క్యాచ్‌లు అయితే డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో అందుకోవడం విశేషం.  స్టన్నింగ్‌ క్యాచ్‌లతో వయసు పెరిగినా వన్నె తగ్గలేదని నిరూపించాడు.

తొలుత ఆసియా లయన్స్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా ప్రజ్ఞాన్‌ ఓజా వేసిన 8వ ఓవర్లో ఉపుల్‌ తరంగను స్టన్నింగ్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. ఓజా వేసిన బంతిని కవర్స్‌ దిశగా ఆడాడు. బంతి వేగం చూస్తే కచ్చితంగా బౌండరీ వెళ్లేలా కనిపించింది. కానీ స్క్వేర్‌లెగ్‌లో ఉన్న కైఫ్‌ ఒక్క ఉదుటన డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్‌ తీసుకున్నాడు. 

ఆ తర్వాత ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లో కైఫ్‌ మరోసారి తన ఫీల్డింగ్‌ మ్యాజిక్‌ చూపెట్టాడు. ప్రవీణ్‌ తాంబే వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ మూడో బంతిని మహ్మద్‌ హఫీజ్‌ లాంగాఫ్‌ దిశగా ఆడాడు. బౌండరీ లైన్‌ వద్ద ఉన్న కైఫ్‌ ముందుకు పరిగెత్తుకొచ్చి డైవ్‌ చేస్తూ అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఇండియా మహరాజాస్‌ ఓటమి చవిచూసింది. 85 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన ఆసియా లయన్స్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసియా లయన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహరాజాస్‌ 16.4 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. 

చదవండి: విండీస్‌ ఘన విజయం; కెప్టెన్‌ ఒక్కడే ఆడితే సరిపోదు

LLC 2023: గంభీర్‌ సేనకు పరాభవం.. అఫ్రిది దండు చేతిలో ఓటమి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top