గంభీర్‌ నన్ను ఫిక్సర్‌ అన్నాడు.. దూషించాడు: శ్రీశాంత్‌ ఆరోపణ | Sakshi
Sakshi News home page

గంభీర్‌ నన్ను ఫిక్సర్‌ అన్నాడు.. దూషించాడు: శ్రీశాంత్‌ ఆరోపణ

Published Fri, Dec 8 2023 7:26 AM

LLC 2023: Gautam Gambhir And Sreesanth Ugly On Field Spat Continues On Social Media - Sakshi

గౌతమ్‌ గంభీర్‌...ఎస్‌.శ్రీశాంత్‌...భారత జట్టు తరఫున కలిసి 49 మ్యాచ్‌లు ఆడారు. 2007 టి20, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ విజయాల్లో భాగస్వాములు. రిటైర్మెంట్‌ తర్వాత ‘సీనియర్లు’గా లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎల్‌ఎల్‌సీ)లో ఆడుతున్నారు. కానీ ఆవేశకావేశాలకు మారుపేరైన వీరిద్దరు ఇలాంటి వెటరన్‌ టోర్నీలో కూడా గొడవ పడ్డారు. గంభీర్‌ తనను పదే పదే ‘ఫిక్సర్‌’ అంటూ దూషించాడని శ్రీశాంత్‌ ఆరోపించాడు.

బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్‌ జెయింట్స్‌ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ తర్వాత ఒక వీడియో విడుదల చేసిన శ్రీశాంత్‌ ‘నా తప్పు ఏమీ లేకపోయినా గంభీర్‌ నన్ను అనరాని మాటలు అన్నాడు. అది సరైంది కాదు’ అని అన్నాడు. అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే  మరో వీడియోలో దానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాడు.

‘ఫిక్సర్, ఫిక్సర్, నువ్వు ఫిక్సర్‌వి అంటూ పదే పదే గంభీర్‌ అన్నాడు. నేను నవ్వుతూ ఉన్నా అతను మాత్రం అలాంటి దూషణలు కొనసాగించాడు. నేను ఒక్క చెడు మాట కూడా మాట్లాడలేదు. అసలు అతనికి ఎందుకు కోపం వచి్చందో, ఎందుకు అలా అన్నాడో నాకు అస్సలు అర్థం కాలేదు’ అని వివరించాడు. ఈ ఘటనపై గంభీర్‌ వైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు కానీ తాను చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను ట్విట్టర్‌లో పెట్టాడు.

ఎల్‌ఎల్‌సీలో తగిన నిబంధనలు, ప్రమాణాలు పాటిస్తున్నామని, ఘటనపై విచారణ చేస్తామని మాత్రం టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. ఆ తర్వాత దీనిని కొనసాగించిన శ్రీశాంత్‌... ‘నువ్వు అందరితో ఇలాగే ఉంటావు, సీనియర్లను కూడా గౌరవించవు. నన్ను అలా అనే హక్కు నీకు లేదు. అయినా నువ్వు సుప్రీం కోర్టుకంటే ఎక్కువా’ అని ప్రశ్నించాడు. 2013 ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించగా... సుప్రీం కోర్టు ఆదేశాలతో దానిని ఏడేళ్లకు తగ్గించడంతో 2020లో అతని నిషేధం ముగిసింది.    

Advertisement
 

తప్పక చదవండి

Advertisement