శ్రీకాంత్‌ శుభారంభం | Kidambi Srikanth enters pre quarterfinals of Thailand Masters Super 300 badminton tournament | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌ శుభారంభం

Jan 30 2025 3:50 AM | Updated on Jan 30 2025 3:50 AM

Kidambi Srikanth enters pre quarterfinals of Thailand Masters Super 300 badminton tournament

తొలి రౌండ్‌లోనే ఓడిన తరుణ్, ఆయుశ్, మిథున్‌

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రుత్విక జోడీ ముందంజ  

బ్యాంకాక్‌: కొత్త ఏడాదిలో భారత స్టార్‌ షట్లర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ తొలి విజయం అందుకున్నాడు. థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రపంచ 47వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21–13, 21–18తో డానిల్‌ దుబోవెంకో (ఇజ్రాయెల్‌)పై గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 

36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ తొలి గేమ్‌ ఆరంభంలో వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 6–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్‌కు కాస్త ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 15–15తో సమమైన దశలో శ్రీకాంత్‌ ఒక్కసారిగా విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 19–15తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత మూడు పాయింట్లు కోల్పోయిన శ్రీకాంత్‌ రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను హస్తగతం చేసుకున్నాడు. 

ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో తెలంగాణ ప్లేయర్‌ తరుణ్‌ మన్నేపల్లి 11–21, 15–21తో చికో వార్దోయో (ఇండోనేసియా) చేతిలో, ఆయుశ్‌ శెట్టి 15–21, 17–21తో జింగ్‌ హాంగ్‌ కోక్‌ (మలేసియా) చేతిలో, మిథున్‌ మంజునాథ్‌ 14–21, 13–21తో షోలే ఐదిల్‌ (మలేసియా) చేతిలో, సతీశ్‌ కుమార్‌ 15–21, 18–21తో అల్వీ ఫర్హాన్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. మరో మ్యాచ్‌లో శంకర్‌ ముత్తుస్వామి సుబ్రమణియన్‌ (భారత్‌) 15–21, 21–15, 21–19తో జూన్‌ వె చీమ్‌ (మలేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు.  

మహిళల సింగిల్స్‌లో రక్షిత శ్రీ ముందంజ వేయగా... తాన్యా హేమంత్, తారా షా, శ్రియాన్షి వలిశెట్టి తొలి రౌండ్‌లో ఓడిపోయారు. రక్షిత శ్రీ 21–19, 21–16తో లుయో యు వు (చైనా)పై గెలుపొందగా... తాన్యా 21–15, 11–21, 13–21తో కిసోనా సెల్వదురయ్‌ (మలేసియా) చేతిలో, తారా షా 15–21, 16–21తో థమనోవన్‌ నితిత్‌క్రాయ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, శ్రియాన్షి 17–21, 13–21తో పిచమోన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం పాలయ్యారు

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జంట 21–8, 21–16తో వీరాఫట్‌–సరారట్‌ (థాయ్‌లాండ్‌) జోడీపై విజయం సాధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement