‘ఆ రోజు నేను ఏడుస్తూనే ఉంటా’ | Indian Football Team Captain Sunil Chhetri On Retirement, Says June 6 I Retire, June 7 I Will Cry A Lot | Sakshi
Sakshi News home page

Sunil Chhetri On Retirement: ‘ఆ రోజు నేను ఏడుస్తూనే ఉంటా’

Published Fri, May 17 2024 4:14 PM

June 6 I Retire June 7 I Will Cry A Lot: Sunil Chhetri On Retirement

‘‘కఠిన శ్రమకోర్చే.. ఓ మంచి ఆటగాడిగా అందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలని మాత్రమే కోరుకుంటా. చూడటానికి చక్కగా కనిపించే హార్డ్‌ వర్కర్‌ ఉండేవాడని నన్ను గుర్తుంచుకుంటే చాలు’’ అని భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం సునిల్‌ ఛెత్రి అన్నాడు.  అదే తాను ఇక్కడ విడిచి వెళ్తున్న జ్ఞాపకంగా మిగిలిపోవాలని పేర్కొన్నాడు.

కాగా భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్ సునిల్‌ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన విషయం తెలిసిందే. జూన్‌ 6న తన చివరి మ్యాచ్‌ ఆడబోతున్నానని 39 ఏళ్ల ఛెత్రి గురువారం ప్రకటించాడు.

ప్రైవేట్, క్లబ్, ఫ్రాంచైజీ లీగ్‌లలో కొనసాగుతా
వచ్చే నెల 6న ప్రపంచకప్‌ ఆసియా జోన్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా కువైట్‌తో జరిగే మ్యాచే తన కెరీర్‌లో చివరిదని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వీడియో షేర్‌ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు.

అయితే ప్రైవేట్, క్లబ్, ఫ్రాంచైజీ లీగ్‌లలో కొనసాగుతానని  ఛెత్రి స్పష్టం చేశాడు. 2005లో అరంగేట్రం చేసిన ఈ స్టార్‌ ఫుట్‌బాలర్‌ దాదాపు రెండు దశాబ్దాల పాటు (19 ఏళ్లు) భారత జట్టుకు సేవలందించాడు. 

ఢిల్లీకి చెందిన ఆర్మీ అధికారి కేబీ ఛెత్రి, సుశీల దంపతులకు 1984, ఆగస్టు 3న సికింద్రాబాద్‌ (తెలంగాణ)లో జన్మించిన ఛెత్రి భారత ఫుట్‌బాల్‌లో అసాధారణ ఫార్వర్డ్‌ ఆటగాడిగా ఎదిగాడు. తదనంతరం నాయకత్వ పటిమతో విజయవంతమైన సారథి అయ్యాడు. భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో చురుకైన దిగ్గజంగా వెలుగొందుతున్నాడు.  

ఆరోజు ఏడుస్తూనే ఉంటా
ఇక తన రిటైర్మెంట్‌ ప్రకటన నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సునిల్‌ ఛెత్రి.. ‘‘జూన్ 6న నేను రిటైర్‌ అవుతాను.. జూన్‌ 7 మొత్తం ఏడుస్తూనే ఉంటాను. జూన్‌ 8న కాస్త రిలాక్స్‌ అవుతాను. జూన్‌ 8 నుంచి బ్రేక్‌ తీసుకుని నా కుటుంబానికి సమయం కేటాయిస్తాను’’ అని తెలిపాడు.

సునిల్‌ ఛెత్రి సాధించిన ఘనతలు 
👉150 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన సునీల్‌ 94 గోల్స్‌ కొట్టాడు. భారత్‌ తరఫున టాప్‌ స్కోరర్‌ కాగా... ఓవరాల్‌గా ఫుట్‌బాల్‌ చరిత్రలో జాతీయ జట్టు తరఫున ఎక్కువ గోల్స్‌ చేసిన క్రీడాకారుల జాబితాలో టాప్‌–3లో ఉన్నాడు. క్రిస్టియానో రోనాల్డో (128 గోల్స్‌; పోర్చుగల్‌), మెస్సీ (106 గోల్స్‌; అర్జెంటీనా) తర్వాతి స్థానం మన ఛెత్రిదే! 
👉మూడు సార్లు భారత జట్టు నెహ్రూ కప్‌ అంతర్జాతీయ టోర్నీ (2007, 2009, 2012) టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 
👉దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) చాంపియన్‌షిప్‌లో భారత్‌ మూడు (2011, 2015, 2021) టైటిల్‌ విజయాలకు కృషి చేశాడు. 
👉2008లో ఏఎఫ్‌సీ చాలెంజ్‌ కప్‌ను గెలిపించిన ఛెత్రి, ఏడుసార్లు ‘ఏఐఎఫ్‌ఎఫ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచాడు. భారత్‌లోని ప్రముఖ ఫుట్‌బాల్‌ క్లబ్‌లైన ఈస్ట్‌ బెంగాల్, డెంపో, ముంబై సిటీ ఎఫ్‌సీ, బెంగళూరు ఎఫ్‌సీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయా జట్లకు లీగ్‌ ట్రోఫీలు అందించాడు.

‘అతనో ఫుట్‌బాల్‌ శిఖరం’ 
భారత బ్యాటింగ్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లి, మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్, భారత ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ బైచుంగ్‌ భూటియా తదితరులంతా ఛెత్రి ఘనతల్ని కొనియాడారు. సోషల్‌ మీడియా వేదికగా వారంతా అతనొక రియల్‌ లెజెండ్‌గా కితాబిచ్చారు. బీసీసీఐ, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ సైతం ఛెత్రి సేవలకు సెల్యూట్‌ చేశాయి.

నాకు ముందే తెలుసు
ఛెత్రి రిటైర్మెంట్‌ గురించి తనకు ముందే తెలుసన్నాడు క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి.  అతడిని చూసి తాను గర్వపడుతున్నానని.. ఏదేమైనా బాగా ఆలోచించిన తర్వాత సునిల్‌ ఛెత్రి ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. కాగా కోహ్లి, సునిల్‌ ఛెత్రి మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.

చదవండి: IPLలో రూ. 20 లక్షలు.. అక్కడ అత్యధిక ధర! నితీశ్‌ రెడ్డి రియాక్షన్‌ ఇదే

Advertisement
 
Advertisement
 
Advertisement