ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు ముందుకు ఆతిథ్య ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు.
హాజిల్‌వుడ్ ప్రస్తుతం తొడ కండరాల(హ్యామ్‌స్ట్రింగ్) గాయంతో బాధపడుతున్నాడు. ఆసీస్ దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్‌లో విక్టోరియాతో జరిగిన మ్యాచ్‌లో జోష్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఆట మధ్యలోనే మైదానం నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత అతడిని స్కాన్ కోసం అస్పత్రి తరలించారు.
అయితే అతడిది తీవ్రమైన గాయం కానప్పటికి కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదటి టెస్టుకు అతడు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ధ్రువీకరించింది. ఆసీస్ సెలక్టర్లు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మైకేల్ నేసర్ జట్టులోకి చేర్చారు. హేజిల్‌వుడ్ గాయం కారణంగా, ఫాస్ట్ బౌలర్ బ్రెండన్ డాగెట్ ఆసీస్ తరపున టెస్టు అరంగేట్రం చేసే అవకాశముంది.
తొలి టెస్టుకు ఆస్ట్రేలియా అప్‌డేటడ్ స్క్వాడ్
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్
చదవండి: IPL 2026: కావ్య మారన్ సంచలన నిర్ణయం..?


