
మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. స్టోక్స్ సేన ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇంగ్లండ్ బ్యాటర్లను ఔట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, కాంబోజ్ చెరో వికెట్ సాధించారు.
బుమ్రాకు ఏమైంది?
ఈ మ్యాచ్‌లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా తేలిపోయాడు. అతడు తన తొలి వికెట్ అందుకోవడానికి 23 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమి స్మిత్‌ను ఔట్ చేసి మొదటి వికెట్‌ను సాధించాడు.
అస్సలు ఈ మ్యాచ్‌లో మనం చూస్తుంది బుమ్రానేనా అన్నట్లు అతడి బౌలింగ్ సాగింది. ఇంగ్లండ్ బ్యాటర్లు సునాయసంగా అతడి బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఇటువంటి బౌలింగ్‌ను బుమ్రా నుంచి చూడలేదు.
ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే తనను తాను సరిదిద్దుకోవడానికి ఒకటి లేదా రెండు ఓవర్లు కంటే ఎక్కువ సమయం పట్టదు. ఏమైందో కానీ మాంచెస్టర్‌లో మాత్రం తన మార్క్‌ను ఈ స్పీడ్ చూపించలేకపోతున్నాడు. ఎక్కువగా డౌన్ ది లెగ్ బంతులు వేసి పరుగులు ఇవ్వడం, సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయకపోవడం వంటి తప్పులు చేశాడు.
ఒకే ఒక్కసారి..
ముఖ్యంగా మాంచెస్టర్‌లో బుమ్రా పేస్ జనరేట్ చేయడానికి ఎక్కువగా ఇబ్బంది పడ్డాడు. ఈ గుజరాత్ స్పీడ్ స్టార్ సాధరణంగా టెస్టుల్లో గంటకు 138- 140 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేస్తాడు. కానీ మ్యాచ్‌లో మాత్రం కేవలం ఒక్కసారి మాత్రమే 140 ప్లస్ వేగంతో బౌలింగ్ చేశాడు.
ఇప్పటివరకు నో బాల్స్‌తో కలిపి 173 బంతులు బౌలింగ్ చేసిన బుమ్రా.. ఒకే ఒక్కసారి 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల్గాడు. అంతకుముందు లీడ్స్ టెస్టులో 266 బంతులు వేసిన బుమ్రా.. 39.84 శాతంతో 106 బాల్స్‌ను 140 కి.మీ పైగా వేగంతో సంధించాడు.
ఆ తర్వాత లార్డ్స్‌లో కూడా 257 బంతుల్లో 69 బంతులను 140 కి.మీ పైగా వేగంతో వేశాడు. కానీ నాలుగో టెస్టులో మాత్రం సరైన పేస్‌తో బౌలింగ్ చేయలేకపోతున్నాడు. దీంతో అతడి గాయం ఏమైనా తిరిగబెట్టిందా అని భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే టీమిండియా మెనెజ్‌మెంట్ ఈ సిరీస్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడించాలని నిర్ణయించింది. ఈ సిరీస్‌లో అతడికి ఇది మూడో మ్యాచ్. తొలి టెస్టులో ఆడిన బుమ్రా, రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు.
తిరిగి వచ్చిన బుమ్రా మూడో టెస్టులో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో నాలుగో టెస్టుకు ఈ స్పీడ్ స్టార్ విశ్రాంతి ఇస్తారని అంతా భావించారు. కానీ కీలకమైన మ్యాచ్ కావడంతో మాంచెస్టర్‌లో అతడిని ఆడించారు. ఈ నిర్ణయం టీమిండియాకు ఏ మాత్రం కలిసిరాలేదనే చెప్పుకోవాలి. కాగా మాంచెస్టర్ టెస్టులో ఇప్పటివరకు 28 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 95 పరుగులిచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనైనా బుమ్రా రాణిస్తాడో లేదో వేచి చూడాలి.
చదవండి: టెస్టు చేజారిపోతోంది!