
ఇప్పటికే 186 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్
తొలి ఇన్నింగ్స్‌లో 544/7
రూట్ భారీ సెంచరీ
పోప్, స్టోక్స్ అర్ధ సెంచరీలు
మాంచెస్టర్‌లో మూడు రోజూ భారత్‌కు నిరాశ తప్పలేదు. ఇంగ్లండ్ దూకుడు కొనసాగగా, పస లేని బౌలింగ్‌తో భారత్ డీలా పడింది. రూట్ రికార్డుల సెంచరీకి తోడు పోప్, స్టోక్స్ కూడా రాణించడంతో ఆతిథ్య జట్టు పూర్తిగా పైచేయి సాధించింది. మన బౌలర్లు 89 ఓవర్లు శ్రమించి ఐదు వికెట్లు తీయగలిగినా... ఇంగ్లండ్ ఆధిక్యం దాదాపు రెండు వందలకు చేరింది. ఈ స్థితిలో నాలుగో రోజు ప్రత్యర్థిని వీలైనంత వేగంగా నిలువరించడంతో పాటు మిగిలిన లోటును పూరించేందుకు మన బ్యాటర్లు పోరాడాల్సి ఉంటుంది.
మాంచెస్టర్: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టుపై ఇంగ్లండ్ పట్టు బిగించింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. ఆ జట్టు ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో ఉంది. జో రూట్ (248 బంతుల్లో 150; 14 ఫోర్లు) భారీ సెంచరీతో కదం తొక్కగా... ఒలీ పోప్ (128 బంతుల్లో 71; 7 ఫోర్లు), బెన్ స్టోక్స్ (134 బంతుల్లో 77 బ్యాటింగ్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. పోప్‌తో మూడో వికెట్‌కు 144 పరుగులు జోడించిన రూట్... ఐదో వికెట్‌కు స్టోక్స్‌తో 142 పరుగులు జత చేశాడు. స్టోక్స్‌తో పాటు డాసన్ (21 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు.
వికెట్ కోల్పోకుండా...
ఓవర్‌నైట్ స్కోరు 225/2తో ఆట కొనసాగించిన పోప్, రూట్ ఇంగ్లండ్‌ను మరింత మెరుగైన స్థితికి చేర్చారు. రెండో రోజు తరహాలోనే భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. రూట్ 22 పరుగుల వద్ద ఉన్నప్పుడు సులువైన రనౌట్ చేసే అవకాశం వచ్చినా భారత్ చేజార్చుకుంది. సిరాజ్ బౌలింగ్‌లో రూట్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడగా... మరోవైపు నుంచి పోప్ దూసుకొచ్చాడు.
దాంతోఆలస్యంగా రూట్ పరుగు కోసం వెళ్లాల్సి వచ్చింది. జడేజా విసిరిన బంతి నాన్‌స్ట్రయికింగ్ స్టంప్స్‌కు నేరుగా తగల్లేదు. అయితే దగ్గరలో ఒక్క బ్యాకప్ ఫీల్డర్ ఉన్నా రూట్ రనౌటయ్యేవాడు! దీనిపై జడేజా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 93 బంతుల్లో పోప్ హాఫ్ సెంచరీని అందుకోగా, 99 బంతుల్లో రూట్ అర్ధసెంచరీ పూర్తయింది. తొలి సెషన్‌లో భారత్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా, ఇంగ్లండ్ 28 ఓవర్లలో 107 పరుగులు చేసింది.
సుందర్ ఆలస్యంగా వచ్చినా...
రెండో రోజు ఆటలో భారత్ 46 ఓవర్లు వేయగా, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవడం చర్చకు దారి తీసింది. మూడో రోజు కూడా చాలా ఆలస్యంగా లంచ్‌కు కాస్త ముందు అతనికి కెప్టెన్ బంతిని అప్పగించాడు. ఇన్నింగ్స్ 69వ ఓవర్‌తో సుందర్ మొదలుపెట్టాడు. అప్పటికే జడేజా 12 ఓవర్లు వేశాడు. అయితే రెండో సెషన్ మొదలు కాగానే సుందర్ తన విలువేమిటో చూపించాడు.
8 పరుగుల వ్యవధిలో అతను 2 వికెట్లు తీసి భారత్‌కు ఊరట అందించాడు. సుందర్ వేసిన చక్కటి బంతిని ఆడలేక పోప్ స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇవ్వగా... షాట్ కోసం ముందుకొచ్చిన బ్రూక్ (3) స్టంపౌటయ్యాడు. స్పిన్‌కు వికెట్లు దక్కడంతో భారత్ కొత్త బంతిని తీసుకోవడంలో 10 ఓవర్లు ఆలస్యం చేసింది. అయితే రూట్, స్టోక్స్ కలిసి మళ్లీ ఇంగ్లండ్‌ను ముందంజలో నిలిపారు. కంబోజ్ వేసిన బంతిని ఫైన్‌లెగ్ దిశగా ఆడి బౌండరీ రాబట్టడంతో 178 బంతుల్లో రూట్ శతకం పూర్తయింది. రెండో సెషన్‌లో ఇంగ్లండ్ 28 ఓవర్లలో 2 వికెట్లు చేజార్చుకొని 101 పరుగులు సాధించింది.
మరో 3 వికెట్లు...
టీ తర్వాత కూడా రూట్, స్టోక్స్ భాగస్వామ్యం కొనసాగింది. భారత బౌలర్లు వీరిని ఇబ్బంది పెట్టడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో 97 బంతుల్లో స్టోక్స్ ఈ సిరీస్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అయితే కొద్ది సేపటికే తీవ్ర అలసటతో అతను రిటైర్డ్‌హర్ట్‌గా మైదానం వీడాడు. మరోవైపు 150 మార్క్‌ను అందుకున్న వెంటనే రూట్... జడేజా బౌలింగ్‌లో ముందుకొచ్చి డిఫెన్స్ ఆడబోయి స్టంపౌటయ్యాడు. సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న జేమీ స్మిత్ (9), క్రిస్ వోక్స్ (4) కూడా తక్కువ వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఈ దశలో మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన స్టోక్స్... డాసన్‌తో కలిసి జాగ్రత్తగా ఆడుతూ రోజును ముగించాడు. చివరి సెషన్‌లో ఇంగ్లండ్ 33 ఓవర్లలో 111 పరుగులు సాధించింది. మూడో రోజు 89 ఓవర్లు ఆడిన జట్టు 3.58 రన్‌రేట్‌తో 319 పరుగులు చేసింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 358
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) రాహుల్ (బి) జడేజా 84; డకెట్ (సి) (సబ్) జురేల్ (బి) కంబోజ్ 94; పోప్ (సి) రాహుల్ (బి) సుందర్ 71; రూట్ (స్టంప్డ్) (సబ్) జురేల్ (బి) జడేజా 150; బ్రూక్ (స్టంప్డ్) (సబ్) జురేల్ (బి) సుందర్ 3; స్టోక్స్ (బ్యాటింగ్) 77; స్మిత్ (సి) (సబ్) జురేల్ (బి) బుమ్రా 9; డాసన్ (బ్యాటింగ్) 21; వోక్స్ (బి) సిరాజ్ 4; ఎక్స్‌ట్రాలు 31; మొత్తం (135 ఓవర్లలో 7 వికెట్లకు) 544.
వికెట్ల పతనం: 1–166, 2–197, 3–341, 4–349, 5–499, 6–515, 7–528.
బౌలింగ్: బుమ్రా 28–5–95–1, అన్షుల్ కంబోజ్ 18–1–89–1, సిరాజ్ 26–4–113–1, శార్దుల్ 11–0–55–0, జడేజా 33–0–117–2, సుందర్ 19–4–57–2.