
డానిల్ మెద్వెదెవ్‌కు షాక్
రెండో రౌండ్‌కు గాఫ్, కీస్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్: ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్, సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అలవోక విజయాలతో శుభారంభం చేశారు. అయితే మాజీ ప్రపంచ నంబర్‌వన్, 11వ సీడ్ రష్యన్ స్టార్ డానిల్ మెద్వెదెవ్‌కు తొలి రౌండ్లోనే ఊహించని షాక్ ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో అమెరికన్ స్టార్లు కొకొ గాఫ్, మాడిసన్ కీస్ వరుస సెట్లతో ప్రత్యర్థుల్ని చిత్తు చేసి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మిగతా సీడెడ్ క్రీడాకారిణుల్లో జెస్సికా పెగూలా, మిర అండ్రీవా ముందంజ వేశారు.
గత ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ కొకొ గాఫ్ (అమెరికా) 6–2, 6–2తో గడెక్కి (ఆస్ట్రేలియా)పై గెలుపొందగా... అజరెంకా (బెలారస్) 6–0, 6–0తో విక్‌మయెర్ (బెల్జియం)పై నెగ్గింది. మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 6–2, 6–4తో అన్క టొడొని (రొమేనియా)పై, ఆరో సీడ్ మిర అండ్రీవా (రష్యా) 6–4, 6–3తో క్రిస్టీనా బుక్సా (స్పెయిన్)పై విజయం సాధించారు. 12వ సీడ్ రిబాకినా 6–1, 4–6, 6–4తో రియెరా (అర్జెంటీనా)పై గెలుపొందగా, ఏడో సీడ్ కీస్ (అమెరికా) 6–2, 6–1తో సవిల్లే (ఆస్ట్రేలియా)ను ఓడించింది. సోఫియా కెనిన్ (అమెరికా) 6–3, 6–1తో గ్రాచెవా (ఫ్రాన్స్)పై గెలిచింది.
జొకో అలవోకగా...
మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 6–3, 6–3, 6–3తో అమెరికన్ ప్లేయర్ మెక్‌డొనాల్డ్‌పై సునాయాస విజయంతో ముందంజ వేశాడు. తాజా ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, టాప్ సీడ్ ఇటలీ స్టార్ సినెర్ 6–4, 6–3, 7–5తో రిండెర్క్‌నెచ్ (ఫ్రాన్స్) గెలుపొందాడు. మూడో సెట్లో స్థానిక ప్లేయర్ నుంచి గట్టీపోటీ ఎదురైనప్పటికీ మరో సెట్‌కు అవకాశమివ్వకుండా మూడు సెట్లలోనే ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు ముగించాడు.
ఈ సీజన్ మెద్వెదెవ్‌కు నిరాశనే మిగిలిస్తోంది. ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టిన ఈ 11వ సీడ్ రష్యన్ స్టార్ ఇక్కడ తొలిరౌండ్లోనే 5–7, 3–6, 6–4, 6–1, 5–7తో కామెరూన్ నోరీ (బ్రిటన్) చేతిలో కంగుతిన్నాడు. బల్గేరియాకు చెందిన 16వ సీడ్ దిమిత్రోవ్ 6–2, 6–3 2–6తో అమెరికన్ క్వాలిఫయర్ కిన్‌పై రెండు సెట్లతో ఆధిక్యంలో ఉండగా రిటైర్డ్‌హర్ట్‌గా కోర్టు నుంచి నిష్క్రమించాడు.
ఏడో సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) 6–3, 6–4, 6–2తో రమొస్ వినొలస్ (స్పెయిన్)పై, గత ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, ఈ సీజన్ ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 6–3, 6–4తో లర్నెర్ టియెన్ (అమెరికా)పై గెలుపొందారు.