
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నీలో రెండో రోజు భారత్‌కు రెండు పతకాలు లభించాయి. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జొనాథన్ గావిన్ ఆంటోనీ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రష్మిక సెహగల్ రజత పతకాన్ని దక్కించుకుంది.
ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో జొనాథన్ 244.8 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అరిగి లుకా (ఇటలీ; 236.3 పాయింట్లు) రజతం, లుకాస్ సాంచెజ్ (స్పెయిన్; 215.1 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. భారత్‌కే చెందిన చిరాగ్ శర్మ 115.6 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
అంతకుముందు 21 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో జొనాథన్ 586 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో, చిరాగ్ శర్మ 578 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో భారత్ నుంచి ముగ్గురు రష్మిక సెహగల్, వన్షిక, మోహిని సింగ్ బరిలోకి దిగారు.
రష్మిక 236.1 పాయింట్లతో రెండో స్థానంలో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వన్షిక 174.2 పాయింట్లతో ఐదో స్థానంలో, మోహిని 153.7 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. రెండో రోజు పోటీలు ముగిశాక భారత్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఏడు పతకాలతో టాప్ ర్యాంక్‌లో ఉంది.
లలిత్ గేమ్ ‘డ్రా’
సాక్షి, గుంటూరు: జాతీయ సీనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ఎంఆర్ లలిత్ బాబు ఖాతాలో వరుసగా రెండో ‘డ్రా’ చేరింది. విజ్ఞాన్ యూనివర్సిటీలో జరుగుతున్న ఈ టోరీ్నలో లలిత్ బాబు తొలి నాలుగు గేముల్లో గెలుపొందాడు.
దీపన్ చక్రవర్తి (రైల్వేస్)తో శుక్రవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను 35 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. సూర్యశేఖర గంగూలీ (పెట్రోలియం) తో గురువారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను లలిత్ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆరో రౌండ్ తర్వాత లలిత్ బాబు ఐదు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.