వాయు కాలుష్యంతో అల్లాడుతున్న దేశ రాజధాని నగరానికి ఉపశమనం కల్పించేందుకు ఇటీవల క్లౌడ్ సీడింగ్‌తో ( cloud seeding) కృత్రిమంగా వర్షాలు కురిపించే ప్రయత్నాలు రెండుసార్లు జరిగాయి. గత అయిదు దశాబ్దాల కాలంలో ఢిల్లీలో ఇలాంటి ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి. ఐఐటీ – కాన్పూర్ భాగస్వామ్యంతో ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాలు అంతగా ఫలించకపోయినప్పటికీ, అందరి దృష్టినీ ఆకర్షించాయి. అసలింతకీ ఈ కృత్రిమ మేఘమథనం అంటే ఏమిటి? ఎలా చేస్తారు? ఏం చేస్తారు? ప్రపంచవ్యాప్తంగా దీని ఫలితాలేమిటి? ఇలా కృత్రి మంగా వర్షాలు కురిపించడంలో లాభమెంత? నష్టమెంత?
కృత్రిమ మేఘమథన ప్రయత్నాలు ఏడున్నర దశాబ్దాల పైగా జరుగుతూనే ఉన్నాయి. సౌదీ, అమెరికా, చైనా, ఇజ్రాయెల్, ఇండొనేషియా, ఆస్ట్రే లియా సహా 50 దేశాలు ఈ ప్రయోగాలు చేశాయి. అయితే, మిశ్రమ ఫలితాలే వచ్చాయి. మన దేశంలోనూ 1952 నుంచి ప్రయోగాలు జరిగాయి. అప్పట్లో హైడ్రోజెన్ బెలూన్లలో ఉప్పు, సిల్వర్ అయొడైడ్‌లను పంపేవారు. ఢిల్లీలోనూ ఎప్పుడో 1960ల్లోనే ప్రయోగం చేసి, విఫలమయ్యారు. ఆ తర్వాత 1970ల నుంచి విమానాల వినియోగం వచ్చింది. తాజాగా అక్టోబర్ 28న ఢిల్లీలో చేసిన ప్రయత్నాలతో వర్షం రాలేదు కానీ, ప్రమాద స్థాయిలో ఉన్న వాయునాణ్యత కాస్తంత మెరుగైంది.
ఏమిటీ క్లౌడ్ సీడింగ్?
మేఘాలు వర్షం కురిపిస్తాయి. కానీ, అన్ని మేఘాలూ వర్షించవు. అందుకే క్లౌడ్ సీడింగ్. ‘క్లౌడ్ సీడింగ్’ అంటే మేఘాలను మథించి, కృత్రిమ పద్ధతిలో వర్షాలు కురిసేలా చేయడం. సామాన్యుల భాషలో... పనిచేస్తున్న వాహనం పెట్రోల్ ఉన్నా సరే బ్యాటరీ బలహీనమై స్టార్ట్ కానప్పుడు బండిని వెనక నుంచి ముందుకు తోసి ఆ ఊపుతో స్టార్ట్ అయ్యేలా చేసి నట్టే, సైన్స్ ఆసరాతో కృత్రిమంగా మేఘాలను ప్రేరేపించి కురిసేలా చేస్తారు. ఓ విమానాన్ని వాడి, మేఘానికి కొన్ని కణాలను జత చేరుస్తారు. జీరో డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండే చల్లటి మేఘాలలో సిల్వర్ అయొడైడ్ కణాలను జత చేర్చే ప్రక్రియ సాగుతుంది. సదరు ఆ కణాలే ‘సీడ్స్’ (విత్తనాలు)గా పనిచేస్తాయి. వాటి చుట్టూ నీటి ఆవిరి ఘనీభవిస్తుంది. అలా బరువెక్కిన కణాలు నేల రాలే క్రమంలో దోవలో అధిక ఉష్ణోగ్రతకు లోనై, ద్రవీభవించడం వాన చినుకులుగా మారడం జరుగు తుంది. అదే వెచ్చటి మేఘాలలో అయితే సోడియం క్లోరైడ్, లేదా పోటాషియం క్లోరైడ్ లాంటి రసాయన ద్రావణాలను సీడింగ్ ఏజెంట్లుగా వినియోగిస్తారు.
తొలి ప్రయోగాలు... తాజా అధ్యయనాలు...
కృత్రిమ వర్ష ప్రయత్నాలు 1946లోనే జరిగాయి. అవపాతం జరిగే భౌతిక సూత్రాలను లోతుగా అవ గాహన చేసుకొనేందుకు అమెరికన్ రసాయనవేత్త, వాతావరణ నిపుణుడు విన్సెంట్ షేఫెర్ అప్పట్లోనే ల్యాబ్‌లో ప్రయోగాలు చేశారు. ఆయన డ్రై ఐస్‌తో ప్రయోగాలు చేస్తే, ఆ తర్వాత శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో కాక, బయటే అనేక ప్రయోగాలు చేశారు. సిల్వర్ అయొడైడ్ స్ఫటికాలను ఉపయోగించి, మెరుగైన ఫలితాలు సాధించారు. అనేక చోట్ల వర్షాలు కురిపించారు. పుణేకు చెందిన ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ’ మాత్రం 1970ల నుంచి ఈ ప్రయోగాలు చేస్తున్నామంటోంది. దీని వల్ల వర్షపాతం 17 శాతం మేర పెరిగినట్టు చెబుతోంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా క్లౌడ్ సీడింగ్. ఆశించిన ఫలితాలు అందించలేదని అమెరికన్ ప్రభుత్వ వర్గాల 2024 నాటి నివేదిక కూడా చెప్పింది.
చదవండి: స్కిన్ కేర్‌పై క్రికెటర్ ప్రశ్న, ప్రధాని మోదీ సమాధానం ఏంటో తెలుసా?
లాభమెంత? నష్టమెంత?
మేఘమథనాన్ని ప్రేరేపించడానికి వాడిన సిల్వర్ అయొడైడ్ తాలూకు అవశేషాలు భూమిపై పడి, పర్యావరణానికి హానికరం కావచ్చని పరిశోధకుల తాజా అధ్యయనం మాట. అలాగే, డ్రై ఐస్ అంటే ఘనరూప కార్బన్ డయాక్సైడే గనక అది కూడా భూతాపాన్ని పెంచుతుందంటున్నారు. సీడింగ్‌కు విమానం, పైలట్లు, సాంకేతిక సిబ్బంది సేవలతో పాటు రసాయన మిశ్రమాలకు బాగా∙ఖర్చవుతుంది గనక అది ఏ మేరకు లాభదాయకమో స్పష్టత లేదు. గత ఏడేళ్ళుగా ఢిల్లీలో మేఘమథన ప్రతిపాదనలు వస్తున్నా, ఈసారే ప్రయోగాలు జరిగాయి. తాజా ప్రయత్నం విఫలమైనా, ప్రయోగాలు కొనసాగిస్తా మని ఐఐటి–కాన్పూర్ చెబుతోంది. వాయు కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలు మానేసి, ఇలా తాత్కాలిక ఉపశమనానికై పాకులాడ డమే విచిత్రం.


