ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరిగాయి. ఆసక్తికరంగా రెండూ హై స్కోరింగ్ మ్యాచ్‌లే అయ్యాయి. రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్లు, బౌండరీల వర్షం, సెంచరీల హోరు, పరుగుల వరద పారింది. ఈ క్రమంలో నిన్నటి రోజుకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది.
టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారికే ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ఏకంగా నలుగురి చేతులు మారింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.
ఉదయం వరకు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉండగా.. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 67 బంతుల్లో అజేయంగా 152 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.
సాయంత్రానికి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రంగంలోకి దిగి మెరుపు సెంచరీతో ఆరెంజ్ క్యాప్‌ను రాహుల్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. రాత్రికి అదే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ తన బ్యాట్‌కు పని చెప్పి, గంటలు కూడా గడవకముందే వైభవ్ నుంచి ఆరెంజ్ క్యాప్ లాగేసుకున్నాడు.
ఇలా ఒకే రోజులో ఆరెంజ్ క్యాప్ నాలుగు సార్లు చేతులు మారడంతో సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా స్పందించారు. ఆరెంజ్ క్యాప్ 24 గంటల మెడికల్ షాప్ ఉద్యోగిలా షిఫ్ట్‌లు మారుతోంది అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, మరొకరు "ఉదయం కోహ్లీ, మధ్యాహ్నం కేఎల్, సాయంత్రం వైభవ్, రాత్రికి అభిషేక్.. ఐపీఎల్ 2026 పూర్తిగా సినిమానే" అని అన్నాడు. ఇలాంటి రకరకాల మీమ్స్‌తో సోషల్‌మీడియా హోరెత్తింది.
కాగా, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ పట్టికలో అభిషేక్ శర్మ 380 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్ తలో 357 పరుగులతో రెండో స్థానాన్ని పంచుకున్నారు. సన్‌రైజర్స్ మరో ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ 349 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 328 పరుగులతో ఐదో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో ఉదయం అగ్రస్థానంలో ఉండిన కోహ్లి రాత్రి కంతా ఐదో స్థానానికి పడిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.


