
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెజెండ్ విరాట్ కోహ్లి పరుగులు వరద పారిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కోహ్లి అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
228 పరుగుల భారీ లక్ష్య చేధనలో ప్రత్యర్ధి బౌలర్లను కోహ్లి ఉతికారేశాడు. కేవలం 30 బంతులు మాత్రమే ఎదుర్కొన్న కోహ్లి 10 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన కింగ్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..
👉ఐపీఎల్‌లో అత్యధిక ఆర్ధ సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా కోహ్లి రికార్డులెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు 63 హాఫ్ సెంచరీలు ఐపీఎల్‌లో సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ ఐపీఎల్‌లో 62 ఆర్ధ శతకాలు నమోదు చేశాడు. తాజా హాఫ్ సెంచరీతో వార్నర్‌ను కోహ్లి అధిగమించాడు. ఈ ఫీట్‌ను కోహ్లి 257వ ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అందుకోగా.. వార్నర్ కేవలం 184 ఇన్నింగ్స్‌లలోనే సాధించాడు.
👉అదేవిధంగా టీ20 క్రికెట్‌లో ఓ జట్టు తరుపున 9వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు. లక్నో మ్యాచ్‌లో 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు. ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్‌టీ20తో కలిపి కోహ్లి ఆర్సీబీ తరుపున 9వేల పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రెండో స్దానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ ముంబై ఇండియన్స్ తరుపన 6060 పరుగులు చేశాడు.
టీ20 క్రికెట్‌లో ఓ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
విరాట్ కోహ్లి (ఆర్సీబీ) – 9030 పరుగులు
రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) – 6060 పరుగులు
జేమ్స్ విన్స్ (హాంప్‌షైర్) – 5934 పరుగులు
సురేశ్ రైనా (సీఎస్‌కే) – 5529 పరుగులు
ఎంఎస్ ధోని (సీఎస్‌కే) – 5314 పరుగులు
👉ఐపీఎల్ సీజన్లలో అత్యధిక సార్లు 600 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సృష్టించాడు. కోహ్లి ఇప్పటివరకు ఐదు సీజన్లలో 600కు పైగా పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి 602 పరుగులు చేశాడు.
చదవండి: IPL 2025: రిషబ్ పంత్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ