
Photo Courtesy: BCCI
ఎట్టకేలకు 18వ ప్రయత్నంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కల సాకారమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (జూన్ 3) జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
చివరి ఓవర్‌ను అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్ 3, ఒమర్‌జాయ్, విజయ్‌కుమార్ వైశాక్, చహల్ తలో వికెట్ తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లినే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్16, లివింగ్‌స్టోన్ 25, జితేశ్ శర్మ 24, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటిదార్ 26, రొమారియో షెపర్డ్ 17, కృనాల్ పాండ్యా 4, భువనేశ్వర్ కుమార్ 1 పరుగు చేసి ఔటయ్యారు.
అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇన్నింగ్స్ మధ్యలో ఒత్తిడికి లోనైన పంజాబ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. ఆఖర్లో శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) పంజాబ్‌ను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే అప్పటకే మ్యాచ్ పంజాబ్ చేతుల్లో నుంచి జారి పోయింది.
పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్ ఆర్మ 24, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 26, జోస్ ఇంగ్లిస్ 39, శ్రేయస్ అయ్యర్ 1, నేహల్ వధేరా 15, స్టోయినిస్ 6, ఒమర్‌జాయ్ 1 పరుగు చేసి ఔటయ్యారు.ఆర్సీబీ బౌలర్లులో కృనాల్ పాండ్యా (4-0-17-2) అద్బుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 2, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, షెపర్డ్ తలో వికెట్ తీసుకున్నారు.
VIRAT KOHLI IN TEARS - THE DREAM MOMENT FOR THE GOAT ❤️ pic.twitter.com/jPxUsccRUL
— Johns. (@CricCrazyJohns) June 3, 2025
ఈ గెలుపుతో ఆర్సీబీతో పాటు ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కల కూడా సాకారమైంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్న విరాట్ ఎట్టకేలకు 18వ సీజన్‌లో టైటిల్ కలను సాకారం చేసుకున్నాడు. విరాట్‌కు 18 నంబర్ మరోసారి కలిసొచ్చింది. విరాట్ జెర్సీ నంబర్ కూడా 18 అన్న విషయం తెలిసిందే. టైటిల్ గెలిచాక విరాట్ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు.