
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌లో వరుసగా ఐదు పరాజయాలు మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే మరో 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని సొంత అభిమానులకే ఆశ లేదు.
సొంత మైదానంలో కేకేఆర్ చేతిలో ఘోర పరాజయం అనంతరం ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పుడే అంతా అయిపోలేదు. సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఇంకా ఉన్నాయి. లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యే సరికి కనీసం నాలుగో స్థానంతోనైనా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాము. ఐపీఎల్ సుదీర్ఘంగా సాగే టోర్నీ. ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాము. ఒక్కసారి ఊపు అందుకున్నామంటే తిరిగి వెనక్కు చూడము.
ప్రస్తుతానికి మేము మంచి క్రికెట్ ఆడటం లేదు. అయితే పరిస్థితులు త్వరలోనే మారతాయి. ఇందు కోసం చాలా కష్టపడుతున్నాము. పరాజయాల బాట వీడి ఒక్క విజయం సాధించినా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ప్లేఆఫ్స్ సమయం వచ్చేసరికి చివరి స్థానాల్లో ఏదో ఒకదాన్ని చేరుకోగలము. ఇలా చేయగలమని ఇప్పటికీ నమ్ముతున్నాను. సత్ఫలితాలు సాధించాలంటే సమూహంగా రాణించాలి. జట్టులో ప్రతి ఒక్కరూ పాటు పడాలి.
వరుసగా ఓడిపోతున్నామని ఆటగాళ్లను వారి సహజ శైలికి భిన్నంగా ఆడమని చెప్పలేము. వారు సొంత శైలిలో అద్భుతంగా ఆడారు కాబట్టే ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలో ఆడే అవకాశం పొందారు. పరిస్థితులు మెరుగుపడటానికి ముందు అధ్వానంగా మారతాయి.
యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా అనుభవజ్ఞులకే పెద్ద పీట వేస్తున్నామనడం వాస్తవం కాదు. జట్టు అవసరాల దృష్ట్యా అప్పటికి ఎవరు అవసరమో వారినే తుది జట్టులోకి తీసుకుంటాము. కఠిన సమయాల్లో అభిమానులందరూ మద్దతుగా ఉండాలి. ఇప్పటికీ ఏమీ మించి పోలేదు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే సత్తా మాకు ఉందని హస్సీ అన్నాడు.
కాగా, సొంత మైదానం చెపాక్‌లో నిన్న జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే కేకేఆర్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం కేకేఆర్ ఆడుతూపాడుతూ 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది (2 వికెట్లు కోల్పోయి).
ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. కెప్టెన్‌గా ధోని వ్యూహాలు ఈ మ్యాచ్‌లో పని చేయలేదు. రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో ధోని కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 14న లక్నో హోం గ్రౌండ్‌లో జరుగనుంది.