GT VS DC: డబుల్‌ సెంచరీ పూర్తి చేసిన కేఎల్‌ రాహుల్‌ | IPL 2025, GT VS DC: KL Rahul Joins 200 Sixes Club In IPL | Sakshi
Sakshi News home page

GT VS DC: డబుల్‌ సెంచరీ పూర్తి చేసిన కేఎల్‌ రాహుల్‌

Apr 19 2025 4:32 PM | Updated on Apr 19 2025 4:47 PM

IPL 2025, GT VS DC: KL Rahul Joins 200 Sixes Club In IPL

Photo Courtesy: BCCI

ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో సిక్సర్ల డబుల్‌ సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా 11వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 19) జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్‌ ఈ ఘనత సాధించాడు. 

రాహుల్‌ ఐపీఎల్‌లో ఇప్పటిదాకా 129 ఇన్నింగ్స్‌లు ఆడి 200 సిక్సర్లు కొట్టాడు. రాహుల్‌కు ముందు భారత బ్యాటర్లలో రోహిత్‌ శర్మ (286), విరాట్‌ కోహ్లి (282), ఎంఎస్‌ ధోని (260), సంజూ శాంసన్‌ (216), సురేశ్‌ రైనా (203) సిక్సర్ల డబుల్‌ సెంచరీ పూర్తి చేశారు. 

ఓవరాల్‌గా రాహుల్‌కు ముందు క్రిస్‌ గేల్‌ (357), రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ ధోని, ఏబీ డివిలియర్స్‌ (251), డేవిడ్‌ వార్నర్‌ (236), కీరన్‌ పోలార్డ్‌ (223), సంజూ శాంసన్‌, ఆండ్రీ రసెల్‌ (212), సురేశ్‌ రైనా ఈ ఘనత సాధించారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. అహ్మదాబాద్‌ వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగిన రాహుల్‌ 14 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. 

ఓపెనర్లుగా బరిలోకి దిగిన అభిషేక్‌ పోరెల్‌ (9 బంతుల్లో 18; 3 ఫోర్లు, సిక్స్‌), కరుణ్‌ నాయర్‌ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడుగానే ఆడినప్పటికీ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. 10 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 1052గా ఉంది. అక్షర్‌ పటేల్‌ (15), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (8) క్రీజ్‌లో ఉన్నారు. 

గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 2 వికెట్లు పడగొట్టగా.. అర్షద్‌ ఖాన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) కొనసాగుతుండగా.. గుజరాత్‌ మూడో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఉంది. 

పంజాబ్‌ రెండు (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు), ఆర్సీబీ నాలుగు (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) స్థానాల్లో ఉండగా.. లక్నో (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), కేకేఆర్‌ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), ముంబై ఇండియన్స్‌ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), రాజస్థాన్‌ రాయల్స్‌ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), సన్‌రైజర్స్‌ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), సీఎస్‌కే వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో కొనసాగుతున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement