SRH vs RR: ఓవరాక్షన్‌.. మూల్యం చెల్లించకతప్పలేదు! | Sakshi
Sakshi News home page

SRH vs RR: ఓవరాక్షన్‌.. మూల్యం చెల్లించకతప్పలేదు!

Published Sat, May 25 2024 10:03 AM

IPL 2024 Hetmyer Gets Punished by BCCI after SRH Beat RR In Qualifier 2

ఐపీఎల్‌-2024లో రాజస్తాన్‌ రాయల్స్‌ ప్రయాణం ముగిసిపోయింది. క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓటమి పాలైన సంజూ శాంసన్‌ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా ఈసారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించాలన్న కల కలగానే మిగిలిపోయింది.

ఇదిలా ఉంటే.. ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్‌ ఆటగాడు షిమ్రన్‌ హెట్‌మెయిర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్‌ నిర్వాహకులు అతడికి జరిమానా విధించారు. ఇంతకీ ఏం జరిగిందంటే?!..

వాళ్లిద్దరు మినహా అంతా విఫలం
చెన్నైలోని చెపాక్‌ వేదికగా సన్‌రైజర్స్‌తో తలపడ్డ రాజస్తాన్‌ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎస్‌ఆర్‌హెచ్‌ విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(42), ఐదో నంబర్‌ బ్యాటర్‌(56- నాటౌట్‌) మినహా మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు.

 

ఆశలన్నీ వమ్ముచేసి.. వికెట్‌ పారేసుకుని
సన్‌రైజర్స్‌ బౌలర్ల ట్రాప్‌లో చిక్కుకుని పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇక పవర్‌ఫుల్‌ హిట్టర్‌గా పేరొందిన షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ 10 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేసి ఘోరంగా విఫలమయ్యాడు.

పద్నాలుగవ ఓవర్లో రైజర్స్‌ లెఫ్టార్మ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో ఊహించని రీతిలో బౌల్డ్‌ అయి వికెట్‌ పారేసుకున్నాడు. జట్టు తనపై పెట్టుకున్న ఆశలు వమ్ము చేశాడు. 

ఈ క్రమంలో.. అప్పటికే పరాజయం దిశగా జట్టు పయనించడం.. పార్ట్‌టైమ్‌ బౌలర్‌ చేతిలో తనకు భంగపాటు ఎదురుకావడంతో హెట్‌మెయిర్‌ తీవ్ర అసహనానికి లోనయ్యాడు.

పనిష్మెంట్‌ ఇచ్చిన బీసీసీఐ
క్రీజును వీడే సమయంలో బ్యాట్‌తో వికెట్లను కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అతడికి జరిమానా విధించడం గమనార్హం. ‘‘షిమ్రన్‌ హెట్‌మెయిర్‌.. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.2 ప్రకారం.. లెవల్‌ 1 తప్పిదానికి పాల్పడ్డాడని మ్యాచ్‌ రిఫరీ తేల్చారు. అతడు కూడా తన తప్పును అంగీకరించాడు’’ అని ప్రకటన విడుదల చేసింది. హెట్‌మెయిర్‌ మ్యాచ్‌ ఫీజులో 10 శాతం మేర కోత విధిస్తున్నట్లు తెలిపింది.

చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్‌ప్రైజ్‌.. ఇంకొక్క అడుగు: కమిన్స్‌
Kavya Maran: దటీజ్‌ కావ్య.. సరైన నిర్ణయాలు!.. తండ్రిని హత్తుకుని చిన్నపిల్లలా!

Advertisement
 
Advertisement
 
Advertisement