కమిన్స్‌ లేకుండానే.. | Sunrisers to play opening IPL matches without Pat Cummins | Sakshi
Sakshi News home page

కమిన్స్‌ లేకుండానే..

Mar 18 2026 4:05 AM | Updated on Mar 18 2026 4:05 AM

Sunrisers to play opening IPL matches without Pat Cummins

ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లు ఆడనున్న సన్‌రైజర్స్‌ 

హెడ్, ఇషాన్, అభిషేక్‌ శర్మలలో ఒకరికి సారథ్య బాధ్యతలు

హైదరాబాద్‌: ఐపీఎల్‌ మాజీ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 2026 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లలో తమ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ సేవలు కోల్పోనుంది. చాలా కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆ్రస్టేలియా స్టార్‌ పేసర్‌ కమిన్స్‌... ఈ సీజన్‌ మొదలయ్యే సమయానికి కోలుకుంటాడని భావించినా అది సాధ్యం కాలేదు. అతను ఇంకా రీహాబిలిటేషన్‌లోనే కొనసాగుతున్నాడని సమాచారం. గత ఏడాది డిసెంబర్‌లో ఇంగ్లండ్‌పై ఒకే ఒక యాషెస్‌ టెస్టు ఆడిన తర్వాత కమిన్స్‌ మళ్లీ మైదానంలోకే రాలేదు.

సీజన్‌లో ఏ మ్యాచ్‌ నుంచి అతను అందుబాటులో వస్తాడో ఇప్పుడే చెప్పలేని స్థితి. 2024లో కెప్టెన్‌గా సన్‌రైజర్స్‌ను కమిన్స్‌ రన్నరప్‌గా నిలిపాడు. గత ఏడాది టీమ్‌ ఆరో స్థానంలో నిలిచింది. రెండు సీజన్లలో కలిపి 30 మ్యాచ్‌లలో కమిన్స్‌ 34 వికెట్లు పడగొట్టాడు. కమిన్స్‌ దూరం కావడంతో హైదరాబాద్‌ ఒకవైపు రెగ్యులర్‌ పేస్‌ బౌలర్‌తో పాటు కెప్టెన్‌ను కూడా కొత్తగా ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 

తుది జట్టులో కచ్చితంగా ఉండే ఆటగాడికే కెప్టెన్సీ అవకాశం కాబట్టి ఆ్రస్టేలియాకే చెందిన విధ్వంసక ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ను ఎంపిక చేసే ఆలోచన ఉంది. కమిన్స్‌ తిరిగి వచ్చే వరకు తాత్కాలికమే కాబట్టి హెడ్‌ ఆసక్తి చూపించకపోతే వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ లేదా మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మకు నాయకత్వ బాధ్యతలు దక్కుతాయి. బౌలింగ్‌లో హర్షల్‌ పటేల్, జైదేవ్‌ ఉనాద్కట్‌లపై అదనపు భారం తప్పదు.  

ఆర్‌సీబీకి హాజల్‌వుడ్‌ గాయాల సమస్య! 
ఐపీఎల్‌లో మరో ఫ్రాంచైజీ కూడా ఆసీస్‌ పేసర్‌ గాయం సమస్యను ఎదుర్కొంటోంది. గత ఏడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) టైటిల్‌ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన పేసర్‌ జోష్‌ హాజల్‌వుడ్‌ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. కండరాలు, మడమ గాయాలతో ఇబ్బంది పడుతున్న హాజల్‌వుడ్‌ టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడం ఖాయమైంది. 

హాజల్‌వుడ్‌ కూడా గత నవంబర్‌ తర్వాత మళ్లీ క్రికెట్‌ ఆడలేదు. అతని రీహాబిలిటేషన్‌ పూర్తయిన తర్వాత ఐపీఎల్‌లో పాల్గొనడంపై స్పష్టత రావచ్చు. హాజల్‌వుడ్‌ గైర్హాజరు ఆర్‌సీబీని బలహీనంగా మార్చడం ఖాయం. భువనేశ్వర్, యశ్‌ దయాళ్, నువాన్‌ తుషార రూపంలో జట్టుకు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. జాకబ్‌ డఫీ కూడా జట్టుకు ఉపయోగపడగలడు.  

హర్షిత్‌ రాణా కష్టమే! 
ఐపీఎల్‌ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)కు గట్టి దెబ్బ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న ప్రధాన పేసర్‌ హర్షిత్‌ రాణా ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. టి20 వరల్డ్‌ కప్‌ జట్టులో ఉండి చివరి నిమిషంలో టోర్నీకి దూరమైన హర్షిత్‌... ఎప్పటి వరకు ఫిట్‌గా మారతాడనే విషయంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు కూడా స్పష్టత లేదు. 

గత రెండు సీజన్లుగా రాణా కేకేఆర్‌ టీమ్‌లో కీలక బౌలర్‌గా సత్తా చాటాడు. రాణాతో పాటు మహీశా పతిరణ కూడా గాయంతో బాధపడుతుండగా, ముజరబాని ఏమాత్రం ప్రభావం చూపగలడనేది ఆసక్తికరం. అయితే వైభవ్‌ అరోరా, ఆకాశ్‌దీప్, ఉమ్రాన్‌ మలిక్‌ రూపంలో పేస్‌ ప్రత్యామ్నాయాలు జట్టుకు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement