IPL 2024: కేకేఆర్‌ వెనుక 'గంభీరం' | Sakshi
Sakshi News home page

IPL 2024: కేకేఆర్‌ వెనుక 'గంభీరం'

Published Mon, May 27 2024 8:34 AM

IPL 2024: Gautam Gambhir, The Man Behind KKR's Success

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ సీజన్‌లో ఆధ్యాంతం అద్భుత విజయాలు సాధించిన కేకేఆర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లోనూ అన్ని రంగాల్లో సత్తా చాటి పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్‌ కిరీటాన్ని సొంతం చేసుకుంది.

ఆటగాళ్లతో సమానమైపాత్ర..
ఈ సీజన్‌లో కేకేఆర్‌ విజయాల్లో ఆటగాళ్ల పాత్ర ఎంత ఉందో జట్టు మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ పాత్ర కూడా అంతే ఉంది. ఈ సీజన్‌తోనే కేకేఆర్‌ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్‌.. ఆ జట్టు సాధించిన ప్రతి విజయంలోనూ తనదైన ముద్ర వేశాడు.

పేరుకు తగ్గట్టుగానే గంభీరంగా..
ఆన్‌ ఫీల్డ్‌ అయినా.. ఆఫ్‌ ద ఫీల్డ్‌ అయినా గంభీరంగా కనిపించే గంభీర్‌ పేరుకు తగ్గట్టుగానే కేకేఆర్‌ విజయాల్లో గంభీరమైన పాత్ర పోషించాడు. గంభీర్‌ తనకు మాత్రమే సాధ్యమైన సాహసోపేతమైన నిర్ణయాలతో కేకేఆర్‌ను గెలుపుబాట పట్టించాడు. గంభీర్‌ ఆధ్వర్యంలో కేకేఆర్‌ ఈ సీజన్‌లో కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. 

నరైన్‌ సక్సెస్‌ వెనుక కూడా గంభీరుడే..
సునీల్‌ నరైన్‌కు ఓపెనర్‌గా ప్రమోషన్‌ ఇచ్చి సత్ఫలితాలు రాబట్టిన ఘనత గంభీర్‌దే. అలాగే ఫైనల్స్‌ హీరో మిచెల్‌ స్టార్క్‌ను దక్కించుకోవడంలోనూ గంభీరే ప్రధానపాత్ర పోషించాడని అంతా అంటారు. యువ పేసర్లు హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరాలను ప్రోత్సాహించడంలోనూ.. వెటరన్‌ ఆండ్రీ రసెల్‌ను వెనకేసుకురావడంలోనూ గంభీర్‌దే ప్రధానమైన పాత్ర. 

శ్రేయస్‌ను వెన్నుతట్టి.. వెంకటేశ్‌పై విశ్వాసముంచి..
శ్రేయస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లపై విశ్వాసముంచి వారి నుంచి సత్ఫలితాలు రాబట్టిన ఘనత కూడా గంభీర్‌కే దక్కుతుంది. రింకూ సింగ్‌, రమన్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి లాంటి లోకల్‌ టాలెంట్‌లకు కూడా గంభీర్‌ అండగా నిలిచాడు. ఇలా ఏరకంగా చూసుకున్నా కేకేఆర్‌కు పూర్వవైభవం దక్కడంలో గంభీర్‌ పాత్ర ప్రధానమైందనడంలో ఎలాంటి సందేహాం లేదు.

సొంత అభిమానులచే ఛీత్కారాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి..
గడిచిన ఆరు సీజన్లలో పేలవ ప్రదర్శనతో సొంత అభిమానల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న కేకేఆర్‌.. గంభీర్‌ రాకతో ఒక్కసారిగా నూతనోత్సాహాన్ని అందుకుని టైటిల్‌ ఎగరేసుకుపోయింది.

షారుఖ్‌ పట్టుబట్టి మరీ..
కేకేఆర్‌ సహ యజమాని షారుఖ్‌ ఖాన్‌ ఈ సీజన్‌ కోసం గంభీర్‌ను పట్టుబట్టి మరీ ఒప్పించి లక్నో సూపర్‌ జెయింట్స్‌ నుంచి పిలిపించుకున్నాడు. మెంటార్‌గా గంభీర్‌కు కేకేఆర్‌ కొత్తేమో కానీ ఆటగాడిగా, కెప్టెన్‌గా గంభీర్‌ కేకేఆర్‌ అభిమానులకు సుపరిచితుడు. ఈ సీజన్‌లో మెంటార్‌గా కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన గంభీర్‌.. 2012, 2014 సీజన్లలో కెప్టెన్‌గా కేకేఆర్‌కు టైటిల్స్‌ అందించాడు. 

కేకేఆర్‌ కెప్టెన్‌గా గంభీర్‌ ప్రస్తానం దీనితోనే ఆగిపోలేదు. గంభీర్‌ నేతృత్వంలో కేకేఆర్‌ 2016, 2017 సీజన్లలోనే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీనికి ముందు 2011 సీజన్‌లోనూ గంభీర్‌ సారథ్యంలో కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌కు చేరింది. కేకేఆర్‌ కెప్టెన్‌గా ఏడు సీజన్ల పాటు కొనసాగిన గంభీర్‌ ఈ జట్టును రెండుసార్లు ఛాంపియన్‌గా.. మూడు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు.. రెండు సీజన్లలో (2013, 2015) లీగ్‌ దశ వరకు విజయవంతంగా నడిపించాడు. తాజాగా మెంటార్‌గా బాధ్యతలు చేపట్టి తన ఆధ్వర్యంలో మూడోసారి కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. 

షారుఖ్‌ విశ్వాసాన్ని నిలుపుకున్నాడు..
కేకేఆర్‌ బాస్‌ షారుఖ్‌కు తనపై అపార విశ్వాసమున్నట్లు గంభీరే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ నమ్మకాన్ని నిలుపుకుంటూ గంభీర్‌ పదేళ్ల తర్వాత తిరిగొచ్చి కేకేఆర్‌కు టైటిల్‌ను అందించాడు. తాజాగా కేకేఆర్‌ టైటిల్‌ గెలిచిన అనంతరం షారుఖ్‌ ఖాన్‌ గంభీర్‌ నుదిటిపై ముద్దు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన చిత్రాలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

 

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement