#MS Dhoni- #Hardik Pandya: ఇలా జరగాలని రాసి పెట్టి ఉందంతే! ధోని చేతిలో ఓడినా బాధపడను! సాయి అద్భుతం..

IPL 2023 Final Hardik Pandya: I Dont Mind Losing To MS Dhoni - Sakshi

IPL 2023 Final CSK Vs GT- Winner Chennai: ఐపీఎల్‌-2023 ఫైనల్‌.. వేదిక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం.. గుజరాత్‌ టైటాన్స్‌ సొంత మైదానం.. వర్షం కారణంగా.. లీగ్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రిజర్వ్‌డేకు మ్యాచ్‌ వాయిదా.. సీజన్‌ ఆరంభంలో ఇక్కడే చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి శుభారంభం చేసిన గుజరాత్‌.. ఫైనల్లోనూ అదే ఫలితం పునరావృతం చేసి వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవాలని భావించింది.

ఒకవేళ వరణుడి కారణంగా మ్యాచ్‌ రద్దైపోయినా.. టేబుల్‌ టాపర్‌గా ఉన్న తమనే విజయం వరిస్తుందని కాస్త ధీమాగానే కనిపించింది.. అయితే, సోమవారం వర్షం తెరిపినిచ్చింది. టాస్‌ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 

సాయి సుదర్శన్‌ ఒంటరి పోరాటం
సీఎస్‌కే ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. వృద్ధిమాన్‌ సాహా హాఫ్‌ సెంచరీ(54)తో మెరవగా.. శతకాల ధీరుడు శుబ్‌మన్‌ గిల్‌ ఈ మ్యాచ్‌లో మాత్రం 39 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ జట్టును ఆదుకునే బాధ్యతను తీసుకున్నాడు.

47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేశాడు. సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. గుజరాత్‌ 214 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి వరుణడి అడ్డంకి కారణంగా సీఎస్‌కే లక్ష్యం 15 ఓవర్లకు 171 పరుగులుగా నిర్దేశించారు అంపైర్లు.

జడ్డూ ఆఖరి బంతికి
ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఫోర్‌ బాది రవీంద్ర జడేజా చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. దీంతో ధోని సేన ఐదోసారి ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడింది. రెండోసారి టైటిల్‌ గెలవాలన్న టైటాన్స్‌ ఆశలపై నీళ్లు చల్లింది.

గెలుపోటముల్లో ఒక్కటిగా ఉంటాం
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ.. తమ జట్టును చూసి గర్వపడుతున్నట్లు తెలిపాడు. గెలవడానికి శాయశక్తులా కృషి చేశామని.. గెలుపోటములలో తాము కలిసే ఉంటామని పేర్కొన్నాడు. తమ ఓటమికి సాకులు వెతకదలచుకోలేదన్న పాండ్యా.. సీఎస్‌కే అద్భుతంగా ఆడి చాంపియన్‌గా నిలిచిందని ప్రశంసించాడు.

అయితే, తమ జట్టులోని యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడని.. ఫైనల్‌ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం అంత తేలికేమీ కాదని తమిళనాడు బ్యాటర్‌ను కొనియాడాడు. మోహిత్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ షమీ.. ఇలా ప్రతి ఒక్కరు జట్టును గెలిపించేందుకు పాటుపడ్డారని పాండ్యా పేర్కొన్నాడు.

రాసి పెట్టి ఉందంతే! ఓడినా బాధపడను
ఇక సీఎస్‌కే కెప్టెన్‌, తన రోల్‌మోడల్‌ ధోని గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ధోని భాయ్‌ని ఇలా చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా జరగాలని రాసి పెట్టి ఉందంతే! నేను ఒకవేళ ఓడిపోవాల్సి వస్తే అదీ ధోని చేతిలో అయితే అస్సలు బాధపడను. 

మంచివాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. నాకు తెలిసిన అత్యంత మంచి వ్యక్తులలో ధోని ఒకడు. ఆ దేవుడు నా వైపు ఉంటాడని అనుకున్నా. కానీ ఈరోజు ధోనిదే అయింది’’ అని హార్దిక్‌ పాండ్యా ఎమోషనల్‌ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో గెలుపొంది ఐదోసారి చాంపియన్‌ అయింది. అహ్మదాబాద్‌ మ్యాచ్‌లో 25 బంతుల్లో 47 పరుగులు సాధించిన చెన్నై ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ధోని 
చాంపియన్‌గా చెన్నై.. గిల్‌ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top