#SaiSudharsan: ఐపీఎల్‌ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా చరిత్ర

IPL 2023 Final-Sai Sudharsan-47 Balls-96 Runs Vs CSK Broke-Many Records - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ యంగ్‌ ప్లేయర్‌ సాయి సుదర్శన్‌ సీఎస్‌కేతో జరిగిన ఫైనల్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. 47 బంతుల్లోనే 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కేవలం నాలుగు పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నప్పటికి తన మెరుపులతో ఆకట్టుకున్నాడు.


Photo: IPL Twitter

అయితే సాయి సుదర్శన్‌ తన  ఇన్నింగ్స్‌ను నిధానంగా ఆరంభించినప్పటికి  అసలు సమయంలో తనలోని డేంజరస్‌ బ్యాటర్‌ను వెలికి తీశాడు. సాహా ఔటైన తర్వాత గేర్‌ మార్చిన సాయి సుదర్శన్‌ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ వేసిన తుషార్‌ దేశ్‌పాండేకు చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో ఒక సిక్సర్‌ సహా మూడు ఫోర్లు కలిపి 20 పరుగులు పిండుకున్నాడు. 31 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన సాయి సుదర్శన్‌.. తర్వాతి 16 బంతుల్లోనే 46 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో సాయి సుదర్శన్‌ ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు కొట్టాడు.


Photo: IPL Twitter

ఐపీఎల్‌ చరిత్రలో ఫైనల్‌ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా సాయి సుదర్శన్‌ చరిత్రకెక్కాడు. ఇంతకముందు మనీష్‌ పాండే 2014 ఐపీఎల్‌ ఫైనల్లో కేకేఆర్‌ తరపున పంజాబ్‌ కింగ్స్‌పై 94 పరుగులు చేశాడు. 2012 ఫైనల్లో సీఎస్‌కేపై కేకేఆర్‌ తరపున మన్విందర్‌ బిస్లా 89 పరుగులు చేశాడు. అయితే రజత్‌ పాటిదార్‌(ఆర్‌సీబీ తరపున 112 నాటౌట్‌ వర్సెస్‌ కేకేఆర్‌) సెంచరీ చేసినప్పటికి అది ఫైనల్‌ మ్యాచ్‌ కాదు.. ఎలిమినేటర్‌లో పాటిదార్‌ సెంచరీ చేసిన అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా నిలిచాడు. అయితే ఫైనల్లో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఘనతను సాయి సుదర్శన్‌ దక్కించుకున్నాడు.


Photo: IPL Twitter

ఇక ఐపీఎల్‌ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్‌గా సాయి సుదర్శన్‌ మూడో స్థానంలో నిలిచాడు. ఇంతకముందు షేన్‌ వాట్సన్‌ 117 పరుగులు నాటౌట్‌(2018లో ఎస్‌ఆర్‌హెచ్‌తో ఫైనల్లో) తొలి స్థానంలో, రెండో స్థానంలో సీఎస్‌కే తరపున వృద్ధిమాన్‌ సాహా 115 పరుగులు పంజాబ్‌ కింగ్స్‌ తరపున, 2014లో కేకేఆర్‌పై ఫైనల్లో, మురళీ విజయ్‌ 95 పరుగులు(సీఎస్‌కే), మనీష్‌ పాండే(94 పరుగులు, కేకేఆర్‌) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

ఐపీఎల్‌ ఫైనల్లో 50 ప్లస్‌ స్కోరు చేసిన రెండో యంగెస్ట్‌ బ్యాటర్‌గా సాయి సుదర్శన్‌ నిలిచాడు. ఇవాళ సీఎస్‌కేతో ఫైనల్లో (47 బంతుల్లో 96 పరుగులు) 21 ఏళ్ల 226 రోజుల వయసులో సుదర్శన్‌ ఈ ఫీట్‌ సాధించాడు. తొలి స్థానంలో మనన్‌ వోహ్రా 2014లో 20 ఏళ్ల 318 రోజుల వయసులో; శుబ్‌మన్‌ గిల్‌  22 ఏళ్ల 37 రోజుల వయసులో(2021లో సీఎస్‌కేతో జరిగిన ఫైనల్లో కేకేఆర్‌ తరపున) మూడో స్థానంలో, రిషబ్‌ పంత్‌ 23 ఏళ్ల 37 రోజుల వయసులో(2020లో ముంబై ఇండియన్స్‌తో ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున) నాలుగో స్థానంలో ఉన్నాడు.  

చదవండి:  శుబ్‌మన్‌ గిల్‌ చరిత్ర.. టీమిండియా తరపున రెండో బ్యాటర్‌గా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top