IPL 2023 Final: అప్పుడు అంచనాలే లేవు.. కానీ ఇప్పుడు! అచ్చం ధోనిలాగే..

Hardik Has To Take Lot Of: Gavaskar Lauds GT Skipper Before IPL 2023 Final - Sakshi

IPL 2023 Final CSK Vs GT: ‘‘మహేంద్ర సింగ్‌ ధోనిని ఆరాధించే చాలా మందిలో హార్దిక్‌ పాండ్యా కూడా ఒకడు. తనే ఈ విషయాన్ని స్వయంగా ఎన్నోసార్లు చెప్పాడు. మ్యాచ్‌ ఆరంభంలో టాస్‌ సమయంలో ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ.. ఎంతో స్నేహంగా కనిపించవచ్చు. కానీ ఒక్కసారి మ్యాచ్‌ ప్రారంభమైన తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. 

హార్దిక్‌ పాండ్యా చెప్పినట్లు కెప్టెన్‌గా తానేం నేర్చుకున్నాడో వ్యూహాల రూపంలో అమలు చేయాల్సి ఉంటుంది’’ అని టీమిండియా దిగ్గజం, కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ అన్నాడు. ఐపీఎల్‌-2023 ఎక్కడ, ఎలా మొదలైందో అక్కడే ముగియనుంది.

నువ్వా- నేనా
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టైటిల్‌ పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌- గుజరాత్‌ టైటాన్స్‌ ఆదివారం (మే 28)అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో మాస్టర్‌ మైండ్‌ ధోని ఐదోసారి ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడతాడా? లేదంటే హార్దిక్‌ పాండ్యా గత సీజన్‌ ఫలితాన్ని పునరావృతం చేసి డిఫెండింగ్‌ చాంపియన్‌ను విజేతగా నిలబెడతాడా? అన్న చర్చ జరుగుతోంది.

అప్పుడు అంచనాలే లేవు
ఈ నేపథ్యంలో సునిల్‌ గావస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సారథిగా హార్దిక్‌ పాండ్యా ఏం నేర్చుకున్నాడో నిరూపించుకునే సమయం ఇదేనని పేర్కొన్నాడు. ‘‘గతేడాది తొలిసారిగా హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టినపుడు.. అతడి నుంచి ఏం ఆశించాలో, సారథిగా అతడి ఆటను ఎలా అంచనా వేయాలో కూడా చాలా మందికి అర్థం కాలేదు.

అచ్చం ధోనిలాగే
ఎందుకంటే పాండ్యా మోస్ట్‌ ఎగ్జైటింగ్‌ క్రికెటర్‌. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జట్టును ఏకంగా టైటిల్‌ విజేతగా నిలిపాడు. నిజానికి జట్టులో ధోని ఎలాంటి వాతావరణం కల్పిస్తాడో పాండ్యా కూడా అచ్చం అలాగే తమ ఆటగాళ్లను ప్రోత్సహించాడు. గుజరాత్‌ డ్రెసింగ్‌రూంలోనూ సీఎస్‌కే మాదిరి వాతావరణం కల్పించాడు. ఈ విషయంలో హార్దిక్‌ పాండ్యాకు కచ్చితంగా క్రెడిట్‌ ఇవ్వాల్సిందే’’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

మిస్టర్‌ కూల్‌కు ఇదే ఆఖరి సీజన్‌?
కాగా గతేడాది టేబుల్‌ టాపర్‌గా నిలిచి చాంపియన్‌గా నిలిచిన గుజరాత్‌.. ఈసారి కూడా అగ్రస్థానంతో లీగ్‌ దశను ముగించింది. విజయాల శాతంలో మెరుగ్గా ఉన్న పాండ్యా వరుసగా రెండోసారి ట్రోఫీ గెలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. మిస్టర్‌కూల్‌కు ఇదే ఆఖరి సీజన్‌ అన్న వార్తల నడుమ తమ సారథి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్‌కే కూడా ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్లు పోటీకి సిద్ధమైంది.

చదవండి: గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సచిన్‌.. ఏమన్నాడంటే?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top