CSK: దెయ్యం పట్టిందారా! దెబ్బకు జడుసుకున్నారు.. వీడియో వైరల్‌

IPL 2023: CSK Fan Manic Celebration After Final Win Frightens Roommates Video Viral - Sakshi

IPL 2023 Winner CSK- Viral Video: మనకు ఇష్టమైన ఆటగాళ్లు అద్బుత విజయాలు సాధించినా.. ఏదేని క్రీడలో మనకు నచ్చిన జట్టు గెలిచినా సంబరాలు చేసుకోవడం సహజం. చాలా మంది కూర్చున్న చోటు నుంచి ఎగిరి గంతేయడం.. పక్కనోళ్లను కౌగించుకోవడం.. మహా అయితే వీధి మొత్తం స్వీట్లు పంచడం చేస్తారు.

కానీ ఇక్కడ ఓ కుర్రాడు ‘భయంకర’ రీతిలో సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అతడి దెబ్బకు రూమ్‌మేట్స్‌ జడుసుకుని పరుగులు తీశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్‌-2023 విజేతగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ అవతరించిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా రిజర్వ్‌ డే (మే 29) నాటి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో గెలుపొందింది.

నరాలు తెగే ఉత్కంఠ
అయితే, ఆఖరి ఓవర్లో మాత్రం నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. చివరి ఓవర్లో చెన్నై గెలవాలంటే 13 పరుగులు అవసరం కాగా మోహిత్‌ శర్మ అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. వరుసగా యార్కర్లు సంధిస్తూ మొదటి నాలుగు బంతుల్లో 0,1,1,1 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

దీంతో గుజరాత్‌ శిబిరంలో ఆశలు చిగురించాయి. రెండు బంతుల్లో చెన్నై విజయ సమీకరణం 10 పరుగులుగా మారిన వేళ.. సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్బుతం చేశాడు. 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌ ఐదో బంతిని సిక్సర్‌గా మలిచిన జడ్డూ.. ఆఖరి బంతికి 4 బాదాడు. దీంతో 171 పరుగులు సాధించిన సీఎస్‌కే టైటాన్స్‌పై విజయం సాధించి ఐదోసారి చాంపియన్‌ అయింది.

దెయ్యం పట్టిందారా? వైరల్‌ వీడియో
దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఇందులో భాగంగా ట్యాబ్‌లో మ్యాచ్‌ చూస్తున్న ఓ కుర్రాడు చేసుకున్న వైల్డ్‌ సెలబ్రేషన్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. సీఎస్‌కే గెలుపొందడంతో సంతోషం పట్టలేక అరుపులు, కేకలతో పక్కనున్న వాళ్లను బెంబేలెత్తించాడు. తన రూమ్‌మేట్స్‌ను పరుగులు పెట్టించాడు. 

ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇది చూసిన వాళ్లు.. ‘‘దెయ్యం పట్టిందారా బాబు! ఏమిటా అరుపులు.. వామ్మో నీ దెబ్బకు పక్కనున్న వాళ్లు జడుసుకున్నారు. అక్కడ గెలిచినోళ్లు కూడా అంతగా సెలబ్రేట్‌ చేసుకోలేదు కదరా?!’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి!

ఇవి కూడా చదవండి: అత్యంత చెత్త రికార్డు.. అయినా అండగా! నన్ను సరైన మార్గంలో నడిపిస్తారని తెలుసు
మధ్యలో డిస్టర్బ్‌ చేయడం ఎందుకో? హార్దిక్‌ను ఏకిపారేసిన గావస్కర్‌..పైగా..

  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top