కోహ్లి పరిస్థితి ఇంతలా దిగజారుతుందని ఊహించలేదు.. రణ్‌వీర్‌ సింగ్‌ ఆవేదన

IPL 2022: Completely Unexpected, Ranveer Singh On Virat Kohli Third Golden Duck - Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రదర్శన రోజురోజుకు తీసికట్టుగా మారుతుందన్నది బహిరంగ రహస్యం. ఈ పరుగుల యంత్రం అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తుండటం ఇందుకో నిదర్శనం. అంతర్జాతీయ కెరీర్‌తో పోలిస్తే ఐపీఎల్‌లో కోహ్లి మెరుపులు అడపాదడపా కనిపించేవి. ఇప్పుడవి కూడా దాదాపుగా కనుమరుగయ్యాయి. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అయితే కోహ్లి ప్రదర్శన పాతాళానికి పడిపోయింది. 

సన్‌రైజర్స్‌తో నిన్న‌ (మే 8) జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే డకౌటైన కోహ్లి ఈ సీజ‌న్‌లో ఇలా (గోల్డన్‌ డకౌట్‌) మూడు సార్లు ఔటయ్యాడు. ఇది అతనితోపాటు అతని అభిమానులను తీవ్రంగా కలచి వేస్తుంది. కోహ్లి తన ఐపీఎల్‌ కెరీర్‌ మొత్తంలో ఆరు సార్లు గోల్డన్‌ డకౌట్‌ కాగా, ప్రస్తుత సీజన్‌లోనే మూడు సార్లు ఆ అప్రతిష్టను మూటగట్టుకోవడాన్ని అతని హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. కోహ్లి ఫామ్‌ ఇంతలా దిగజారుతున్నప్పటికీ అభిమానులు అతనికి అండగా నిలుస్తుండటం విశేషం. ఫామ్‌ విషయంలో కోహ్లి ఇంత కంటే హీన స్థితికి దిగజారినప్పటికీ తాము అండగా ఉంటామంటూ వారు సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 

కోహ్లి తన కెరీర్‌లో ఎదుర్కొంటున్న హీన దశపై బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్ సింగ్ సైతం స్పందించాడు. కోహ్లి ఇలా తొలి బంతికే ఔటవ్వడం చూస్తుంటే బాధగా ఉందని, కోహ్లి పరిస్థితి ఇంతలా దిగజారుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఈ వైఫల్యాలు కోహ్లిని ఏమీ చేయలేవని, అతను తిరిగి తప్పక పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు.

కోహ్లి ఎప్పటికీ గొప్ప క్రికెటరేన‌ని, అతని స్థాయి ఎప్పటికీ పడిపోదని, రన్‌ మెషీన్‌ త్వరగా ఈ చెడు దశ నుంచి బయటపడాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించాడు. త్వరలో జరగుబోయే టీ20 ప్రపంచకప్‌లో కోహ్లి దెబ్బ తిన్న పులిలా విరుచుకుపడటం ఖాయమని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో కూడా కోహ్లి త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని, అంతేకాకుండా తన జట్టును ఛాంపియన్‌గా నిలబెడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.  
చదవండి: IPL 2022: డెవాన్‌ కాన్వేను దిగ్గజ ఆటగాడితో పోలుస్తున్న నెటిజన్లు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top