టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ ఆడం మిల్నే గాయపడ్డాడు. ఫలితంగా ఐసీసీ టోర్నీ నుంచి అతడు వైదొలిగాడు.
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని శుక్రవారం ధ్రువీకరించింది. తొడ కండరాల గాయంతో మిల్నే వరల్డ్‌కప్ జట్టుకు దూరమైనట్లు తెలిపింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్‌లో భాగంగా మిల్నే సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా అతడు గాయపడ్డాడు.
మిల్నే స్థానంలో అతడే
ఇక ఆడం మిల్నే (Adam Milne) స్థానాన్ని బ్లాక్‌క్యాప్స్.. కైలీ జెమీషన్ (Kyle Jamieson)తో భర్తీ చేసింది. రిజర్వు ప్లేయర్‌గా ఉన్న అతడిని ప్రధాన జట్టులోకి చేర్చింది. జెమీషన్ స్థానంలో మరో ట్రావెలింగ్ రిజర్వును త్వరలోనే ఎంపిక చేయనున్నారు. కాగా కివీస్ జట్టును గాయాల బెడద వేధిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే విలియమ్ ఒరూర్కీ, బ్లేయర్ టిక్నర్, నాథన్ స్మిత్, బెన్ సియర్స్ వంటి ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. ఇక కెప్టెన్ మిచెల్ సాంట్నర్, మార్క్ చాప్‌మన్, మ్యాట్ హెన్రీ తదితరులు ఇటీవలే గాయాల నుంచి కోలుకున్నారు. వీరంతా ప్రస్తుతం టీమిండియాతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నారు.
ఫెర్గూసన్ సైతం
ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ జట్టులో భాగమైన లాకీ ఫెర్గూసన్ పిక్కల్లో నొప్పి కారణంగా టీమిండియాతో సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఒకవేళ వరల్డ్‌కప్ నాటికి అతడు కోలుకోకపోతే జట్టుకు దూరమయ్యే పరిస్థితి.
కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంకలు వేదికలుగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. కాగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. తొలి టీ20లో టీమిండియా గెలవగా.. ఇరుజట్ల మధ్య శుక్రవారం నాటి రెండో టీ20కి రాయ్‌పూర్ వేదిక.
టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీకి న్యూజిలాండ్ అప్‌డేటెడ్ జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, కైలీ జెమీషన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.
చదవండి: వరల్డ్‌కప్-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్


