
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu)... బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య (BWF) అథ్లెట్స్ కమిషన్‌లో మూడోసారి చోటు దక్కించుకుంది. 2025 నుంచి 2029 నవంబర్ వరకుగానూ బీడబ్ల్యూఎఫ్ శుక్రవారం సభ్యుల పేర్లను వెల్లడించింది. సింధు 2017 నుంచి కమిషన్‌లో కొనసాగుతోంది.
ఇక 2020 బీడబ్ల్యూఎఫ్ సమగ్రత అంబాసిడర్‌గానూ ఉంది. తాజాగా అన్ సె యంగ్ (కొరియా), దోహా హానీ (ఈజిప్ట్), జియా యి ఫ్యాన్ (చైనా), డెబోరా జిల్లే (నెదర్లాండ్స్)తో కలిసి సింధు అథ్లెట్స్ కమిషన్‌కు ఎంపికైంది. ఎలాంటి పోటీ లేకపోవడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రతి నిర్ణయ ప్రభావం వారిపైనే
‘బీడబ్ల్యూఎఫ్‌నకు అథ్లెట్లే కీలకం. మేం తీసుకునే ప్రతి నిర్ణయ ప్రభావం వారిపైనే పడుతుంది. బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్... ప్రపంచ బ్యాడ్మింటన్ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు దోహదపడుతుంది. కొత్త సభ్యులకు శుభాకాంక్షలు. వీరి చేరికతో కమిషన్ మరింత బలోపేతం అవుతుంది.
మనందరం కలిసి బ్యాడ్మింటన్‌ను ప్రపంచంలోని ప్రముఖ క్రీడల్లో ఒకటిగా నిలిపేందుకు కృషి చేయాలి. భవిష్యత్తు కార్యచరణ రూపొందించడంలో వారి సహకారాన్ని ఆశిస్తున్నాము’ అని బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు ఖున్‌యింగ్ పటామా లీస్వాడ్రకుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అథ్లెట్స్ కమిషన్ బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్‌కు సంప్రదింపుల సంస్థగా పనిచేస్తుంది. టోర్నమెంట్‌ల నియమ నిబంధనలు, అథ్లెట్ల సంక్షేమం, అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఎదురయ్యే సవాళ్లు ఇలా పలు కీలక అంశాలపై కమిషన్ సూచనలు చేయనుంది.
ప్రస్తుతం కమిషన్‌లో ఐదుగురు సభ్యులు ఉండగా... కో అప్షన్ మెంబర్‌ను ఎంపిక చేయడం ద్వారా ఆ సంఖ్యను ఆరుకు పెంపొందించుకునే అవకాశం బీడబ్ల్యూఎఫ్‌నకు ఉంది. కొత్తగా ఏర్పడిన కమిషన్... త్వరలో చైర్మన్‌ను ఎన్నిక చేసుకోనుంది.
ఇదీ చదవండి:
భారత జట్టులో శ్రీజ, స్నేహిత్
భువనేశ్వర్: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్ పోటీలకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి ఈ నెల 15 వరకు భువనేశ్వర్ వేదికగా జరగనున్న ఈ టోర్నమెంట్‌లో తెలంగాణ ప్లేయర్లు ఆకుల శ్రీజ, సురావజ్జుల స్నేహిత్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
వీరితో పాటు స్టార్ ప్లేయర్లు మనికా బత్రా, దియా చిటాలే, స్వస్తిక ఘోష్, మానవ్ ఠక్కర్ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య, ఆసియా టేబుల్ టెన్నిస్ యూనియన్, భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య సంయుక్తంగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నాయి.
చైనా, జపాన్, కొరియా, చైనీస్ తైపీ, బంగ్లాదేశ్ సహా మొత్తం 22 దేశాలకు చెందిన 500 మందికి పైగా ప్లేయర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఇప్పటికే భారత్‌కు చేరుకున్న పలువురు అంతర్జాతీయ స్టార్‌లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్టు 2026లో లండన్ వేదికగా జరగనున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించనుంది.
భారత జట్టు: మహిళల విభాగం: ఆకుల శ్రీజ, మనిక బత్రా, దియా చిటాలే, యశస్విని, స్వస్తిక ఘోష్.
పురుషుల విభాగం: మానవ్ ఠక్కర్, మనుశ్ షా, స్నేహిత్, అంకుర్ భట్టాచార్య, పాయస్ జైన్.