
భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ ప్రతిక రావల్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ షాకిచ్చింది. ఇంగ్లండ్ మహిళలతో జరిగిన తొలి వన్డేలో తమ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ప్రతిక రావల్‌కు జరిమానా విధించింది. ఆమె మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా ఓ డెమెరిట్ పాయింట్ కూడా ఆమె ఖాతాలో చేరింది.
అసలేమి జరిగిందంటే?
సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ప్రతిక 36 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. అయితే భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ అద్బుతమైన బంతితో రావల్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో సహనం కోల్పోయిన రావల్ తన భుజంతో ఎక్లెస్టోన్‌ను ఢీకొట్టింది. అంతేకాకుండా ఇంగ్లీష్ పేసర్ లారెన్ ఫైలర్‌తో కూడా రావల్ దురుసగా ప్రవర్తించింది.
దీంతో లెవల్-1 నేరంగా పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. 24 ఏళ్ల రావల్‌కు ఊహించని షాకిచ్చింది. మరోవైపు స్లోఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టుపై కూడా ఐసీసీ జరిమానా వేసింది. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధించినట్లు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది.
కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(62 నాటౌట్) ప్లేయర్‌గా ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూలై 19న లార్డ్స్ వేదికగా జరగనుంది.
చదవండి: సిరాజ్ సింహం లాంటోడు.. కానీ ఒక్కోసారి మేమే వారిస్తాం: టీమిండియా కోచ్