
సిరీస్‌ను సమం చేసే లక్ష్యంతో టీమిండియా
సొంతగడ్డపై పట్టు కోసం ఇంగ్లండ్
గాయంతో బెన్ స్టోక్స్ దూరం
మధ్యాహ్నం గం.3:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
నేటి నుంచి ఇంగ్లండ్‌తో భారత్ ఆఖరి టెస్టు
మాంచెస్టర్‌లో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ స్కోరు 0/2 కాగానే మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా ముగిసినట్లే అనిపించింది. కానీ మన ఆటగాళ్ల అసాధారణ పోరాటం సిరీస్ ఆశలు సజీవంగా ఉంచగలిగింది. గత మ్యాచ్‌తో పెరిగిన ఆత్మవిశ్వాసం, ఉత్సాహంతో ఇప్పుడు భారత్ గెలుపుపై దృష్టి పెట్టింది.
సీనియర్లు తప్పుకున్న తర్వాత తొలి సిరీస్, యువ జట్టు, కొత్త కెప్టెన్... ఇలాంటి ప్రతికూలతలతో బరిలోకి దిగిన జట్టు ప్రత్యర్థి వేదికపై సిరీస్‌ను సమం చేసినా అది గెలుపుతో సమానమే! అలాంటి అవకాశం ముందుండగా టీమిండియా చివరి పోరుకు సిద్ధమైంది. మరోవైపు అన్నీ తానే అయి జట్టును నడిపించిన కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరం కావడంతో బలహీనపడిన ఇంగ్లండ్ ఆఖరి టెస్టును ఎలా ముగిస్తుందో చూడాలి.
లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ చివరి అంకానికి చేరింది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి ఓవల్ మైదానంలో చివరిదైన ఐదో టెస్టు జరగనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2–1తో ఆధిక్యంలో ఉండగా...భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే 2–2తో సిరీస్ సమంగా ముగుస్తుంది. మ్యాచ్ గెలిచినా లేక ‘డ్రా’ అయినా ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’ సిరీస్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంటుంది.
బుమ్రా, పంత్ లేకపోవడంతో పాటు పలు ఇతర మార్పులతో భారత్ సన్నద్ధం కాగా, స్టోక్స్ దూరం కావడంతో నాలుగు మార్పులతో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. 2007లో ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ నెగ్గిన తర్వాత ఆడిన నాలుగు సిరీస్‌లనూ భారత్ చేజార్చుకుంది. ఓవల్‌లో గెలుపు దక్కితే సమంగా నిలిచి సగర్వంగా జట్టు స్వదేశానికి చేరవచ్చు.
జురేల్, ఆకాశ్‌దీప్‌కు చోటు...
సిరీస్‌కు ముందు అనుకున్నట్లుగానే బుమ్రా మూడు టెస్టులకే పరిమితమవుతూ ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో మరో పేసర్ ఆకాశ్‌దీప్ ఆడటం ఖాయమైంది. గత టెస్టులో పూర్తిగా విఫలమైన అన్షుల్ కంబోజ్‌ను కూడా జట్టు పక్కన పెట్టాలని నిర్ణయించడంతో ప్రసిధ్ కృష్ణ టీమ్‌లోకి రానున్నాడు. వీరితో పాటు సిరాజ్ పేస్ బౌలింగ్‌ను నడిపించనున్నాడు. ఓవల్ పిచ్, వాతావరణాన్ని బట్టి చూస్తే స్పిన్నర్‌కంటే నాలుగో పేసర్ అవసరమే ఎక్కువగా కనిపిస్తోంది.
పైగా ముందే చెప్పినట్లు టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్‌కంటే బ్యాటింగ్ చేయగలిగే ఆటగాడికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. అదే జరిగితే గత మ్యాచ్‌లో విఫలమైనా సరే... శార్దుల్‌కే మరో అవకాశం దక్కుతుంది. లేదంటే అర్ష్ దీప్ సింగ్ టెస్టుల్లో అరంగేట్రం చేయవచ్చు. ఎలా చూసినా ‘చైనామన్ స్పిన్నర్’ కుల్దీప్ యాదవ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా సిరీస్‌ను ముగించే అవకాశాలే కనిపిస్తున్నాయి. పంత్ స్థానంలో గత రెండు టెస్టుల్లో సబ్‌స్టిట్యూట్‌గా చేసిన జురేల్ తుది జట్టులోకి వస్తాడు.
బ్యాటింగ్‌కు సంబంధించి సానుకూల స్థితి ఉండటం జట్టుకు మేలు చేసే అంశం. సిరీస్‌లో టాప్–5 పరుగుల జాబితాలో గిల్, రాహుల్, జడేజా ఉన్నారు. ఈ ముగ్గురూ మరో సారి సత్తా చాటితే భారీ స్కోరు ఖాయం. యశస్వి జైస్వాల్ కాస్త మెరుగ్గా ఆడాల్సి ఉండగా, సాయి సుదర్శన్ కూడా రాణించడం అవసరం. సుందర్ తన బ్యాటింగ్ పదునేమిటో మాంచెస్టర్‌లో చూపించాడు.
నాలుగు మార్పులతో...
ఓల్డ్ ట్రఫోర్డ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 143 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసి ఇంగ్లండ్ బాగా అలసిపోయింది. కోలుకునేందుకు మూడు రోజుల విరామం కూడా చాలా తక్కువ. అటు శారీరకంగా, ఇటు మానసికంగా కూడా జట్టు కాస్త దెబ్బ తిని ఉంది. ఇలాంటి స్థితిలో కెప్టెన్ బెన్ స్టోక్స్ భుజం గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకోవడం జట్టుకు పెద్ద దెబ్బ. ఆటగాడిగా మాత్రమే కాకుండా సారథిగా అతను మైదానంలో ఉండే విలువేమిటో ఇంగ్లండ్‌కు బాగా తెలుసు.
కానీ ఈ మ్యాచ్ కూడా ఆడితే గాయం మరింత ముదిరే ప్రమాదం ఉండటంతో స్టోక్స్ దూరమయ్యాడు. కెపె్టన్‌గా, బ్యాటర్‌గా కూడా ఓలీ పోప్ ప్రభావం చూపించాల్సి ఉంది. క్రాలీ, డకెట్ శుభారంభం ఇవ్వాల్సి ఉండగా, రూట్ బ్యాటింగ్ జట్టుకు ప్రధాన బలం. గత టెస్టులో విఫలమైన బ్రూక్ ఇక్కడ రాణించాలని పట్టుదలగా ఉన్నాడు. ఆరో స్థానంలో బెతెల్‌కు అవకాశం దక్కింది. అయితే ఇంగ్లండ్ బౌలింగ్ ఒక్కసారిగా బలహీనంగా కనిపిస్తోంది.
ఆర్చర్, కార్స్‌లకు విశ్రాంతినివ్వగా...గత టెస్టులో పూర్తిగా విఫలమైన స్పిన్నర్ డాసన్‌ను ముందే పక్కన పెట్టారు. అయితే అతి పేలవంగా 52.80 సగటుతో 10 వికెట్లు తీసిన వోక్స్ మళ్లీ బౌలింగ్ భారాన్ని మోయాల్సి వచ్చింది. మిగతా ముగ్గురు పేసర్లలో టంగ్‌కు మళ్లీ అవకాశం దక్కగా... అట్కిన్సన్, ఒవర్టన్‌లకు సిరీస్‌లో ఇదే తొలి మ్యాచ్ కానుంది.
తుది జట్ల వివరాలు:
భారత్ (అంచనా): శుబ్‌మన్ గిల్ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, శార్దుల్ ఠాకూర్/అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్‌దీప్, ప్రసిధ్ కృష్ణ, సిరాజ్.
ఇంగ్లండ్: ఓలీ పోప్ (కెప్టెన్ ), జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెతెల్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్.
2 ఓవల్ మైదానంలో 15 టెస్టులు ఆడిన భారత్ 2 గెలిచి, 6 ఓడింది. 2021 సిరీస్‌లో ఇంగ్లండ్‌పై నెగ్గిన టీమిండియా... 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇక్కడే ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.
పిచ్, వాతావరణం
బౌన్సీ వికెట్‌తో పేస్ బౌలింగ్‌కు అనుకూలం. పిచ్‌పై పచ్చిక కనిపిస్తోంది. టాస్ గెలిచే జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్ రోజుల్లో అప్పుడప్పుడు వర్ష సూచన ఉంది.