
అవకాశం దక్కితే అన్నీ క్రీడాంశాల్లో పోటీలు
ఆర్చరీ, షూటింగ్, కబడ్డీ, ఖోఖోకు పెద్దపీట
న్యూఢిల్లీ: 2030 కామన్వెల్త్ క్రీడలను స్వదేశంలో నిర్వహించేందుకు వేసిన బిడ్‌కు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన ఒలింపిక్ సంఘం ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో సభ్యులంతా మూకుమ్మడిగా బిడ్‌ను ఆమోదించారు.
చివరిసారిగా 2010లో కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యమివ్వగా... ఇరవై ఏళ్ల తర్వాత తిరిగి అవకాశం దక్కితే పూర్తి స్థాయిలో టోర్నమెంట్‌ను నిర్వహిస్తామని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష వెల్లడించారు.
2026లో గ్లాస్గో వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్ వంటి పలు క్రీడాంశాలను తొలగించారు. ఈ నేపథ్యంలో తదుపరి క్రీడలకు ఆతిథ్యమిచ్చే చాన్స్ వస్తే పూర్తి స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని ఉష పేర్కొన్నారు.
‘సభ్యులంతా సమష్టిగా బిడ్‌కు ఆమోదం తెలపడం ఆనందం. అహ్మదాబాద్‌లో మాత్రమే క్రీడలు నిర్వహిస్తామని చెప్పలేదు. న్యూఢిల్లీ, భువనేశ్వర్‌లో కూడా మెరుగైన సదుపాయాలు ఉన్నాయి. 2026 గ్లాస్గో కామెన్వెల్త్ క్రీడల్లో పలు క్రీడాంశాలను తీసేశారు. 2030 ఆతిథ్య హక్కులు దక్కితే 2010లో మాదిరిగా అన్నీ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తాం’ అని పీటీ ఉష తెలిపారు.
ఐఓసీ ఫండ్‌పై సానుకూలత..
జాతీయ క్రీడా సమాఖ్యల్లోని అనిశ్చితి నేపథ్యంలో... ఏడాది కాలంగా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. గతేడాది అక్టోబర్ 8న జరిగిన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం నుంచి నిధుల విడుదలను నిలిపివేశారు.
అయితే అంతర్గత విబేధాలు అధిగమించిన నేపథ్యంలో తిరిగి గ్రాంట్‌లు వస్తానయని భారత ఒలింపిక్ సంఘం ఆశిస్తోంది. బుధవారం ఐఓఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ భేటీ సజావుగా సాగడంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని పీటీ ఉష ఆశిస్తున్నారు.