
లుసానే: అంతర్జాతీయ క్రీడాకారులు శారీరకంగా ఎదుర్కొనే ఫిట్‌నెస్ సమస్యలతో పాటు ఇటీవలి కాలంలో మానసిక సమస్యలు కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఆటపరంగా అద్భుతాలు చేసే స్థాయి ఉన్నా... మానసిక దృఢత్వం లేక కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకోలేక కుప్పకూలిపోతున్నారు.
ఇలాంటి వారికి తగిన మార్గనిర్దేశనం చేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) యోచిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా 9 మందితో ‘మెంటల్ హెల్త్ అంబాసిడర్స్’ అంటూ ప్రచారకర్తలను నియమించింది. భారత తొలి ఒలింపిక్ వ్యక్తిగత స్వర్ణపతక విజేత, షూటర్ అభినవ్ బింద్రాకు ఈ బృందంలో సభ్యుడిగా అవకాశం దక్కింది.
హోలీ బ్రాడ్‌షా (పోల్‌వాల్ట్), కెమిలె చెంగ్, బ్రూన్ ఫాటస్, ర్యాన్ పీనీ (స్విమ్మింగ్), గ్రేసీ గోల్డ్ (ఫిగర్ స్కేటింగ్), మారీ జోసీ, అకానీ సింబైన్ (స్ప్రింట్), మాసోమా అలీ జాదా (సైక్లిస్ట్) కూడా బింద్రాతో పాటు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారు. 42 ఏళ్ల బింద్రా ఇప్పటికే ఐఓసీ అథ్లెట్స్ కమిషన్ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు.
సానుకూల వాతావరణం ఉండేలా..
‘శారీరక ఆరోగ్యంతో పాటు ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని ఐఓసీ భావిస్తోంది. ఏ ఆటగాడు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొనరాదు. అందుకే ఐఓసీ మెంటల్ హెల్త్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఒలింపియన్లతో ఈ టీమ్‌ను ఎంపిక చేశాం.
వీరు తమ పరిజ్ఞానం, అనుభవంతో ఆటగాళ్లకు సరైన సూచనలిస్తారు. సమస్యలతో బాధపడుతున్న క్రీడాకారులతో స్వయంగా మాట్లాడి దాని ప్రకారం వారికి తగిన విధంగా సహాయం చేస్తారు.
ఐఓసీ ఆలోచన ప్రకారం ఏ అథ్లెట్ కూడా ఎలాంటి మానసిక సమస్యలతో బాధపడకూడదు. అలాంటి సానుకూల వాతావరణాన్ని తయారు చేయడమే దీని లక్ష్యం’ అని ఐఓసీ ప్రకటించింది.