
భారతదేశం మరోసారి అంతర్జాతీయ క్రీడా వేదికగా నిలవబోతోంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ సమర్పించాలన్న యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రీడలకు గుజరాత్‌లోని ప్రధాన నగరం అహ్మదాబాద్ వేదికగా ఎంపిక చేయబడింది.
బిడ్ ఆమోదం పొందితే గుజరాత్ ప్రభుత్వానికి సహకార ఒప్పందం, గ్రాంట్–ఇన్–ఎయిడ్ మంజూరు చేయడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో 72 దేశాల నుంచి అథ్లెట్లు, కోచ్‌లు, మీడియా ప్రతినిధులు పాల్గొంటారు. ఈ క్రీడల నిర్వహణ వల్ల పర్యాటకం అభివృద్ది చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడి, స్థానిక వ్యాపారాలకు లాభాలు వస్తాయి. అలాగే భారత యువతకు కూడా ప్రేరణ కలిగే అవకాశం ఉంది.
అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియం లాంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్న క్రికెట్ స్టేడియం ఉంది. ఇందులో 2023 ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌ను విజయవంతంగా నిర్వహించారు. బిడ్ మనకు దక్కితే ఈ స్టేడియం కామన్వెల్త్ క్రీడలకు కూడా సిద్ధమవుతుంది. అహ్మదాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎంక్లేవ్ కూడా నిర్మాణంలో ఉంది. ఇందులో అక్వాటిక్స్ సెంటర్, ఫుట్‌బాల్ స్టేడియం, ఇండోర్ ఎరీనాలు ఉండనున్నాయి.
2030 కామన్‌వెల్త్ క్రీడలకు ఆగస్టు 31 లోపు తుది బిడ్ సమర్పించాల్సి ఉంది. నవంబర్ చివరి వారంలో గ్లాస్గోలో జరిగే జనరల్ అసెంబ్లీ ద్వారా ఆతిథ్య దేశం నిర్ణయించబడుతుంది. భారత్‌లో చివరిసారిగా 2010లో న్యూఢిల్లీ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరిగాయి.