భారత్‌ 2 పాక్‌ 0 | Indian tennis team has shown their dominance | Sakshi
Sakshi News home page

భారత్‌ 2 పాక్‌ 0

Feb 4 2024 3:56 AM | Updated on Feb 4 2024 3:56 AM

Indian tennis team has shown their dominance - Sakshi

ఇస్లామాబాద్‌: డేవిస్‌కప్‌ వరల్డ్‌ గ్రూప్‌–1 ప్లే ఆఫ్‌ పోటీలో భారత టెన్నిస్‌ జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. పాకిస్తాన్‌తో జరుగుతున్న ఈ పోటీలో తొలిరోజు శనివారం జరిగిన రెండు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లోనూ భారత క్రీడాకారులు రామ్‌కుమార్‌ రామనాథన్, శ్రీరామ్‌ బాలాజీ విజయం సాధించారు. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల ఈ పోటీలో ప్రస్తుతం భారత్‌ 2–0తో ఆధిక్యం సంపాదించింది. నేడు జరిగే మిగతా మూడు మ్యాచ్‌ల్లో (డబుల్స్, రెండు రివర్స్‌ సింగిల్స్‌) ఒకదాంట్లో గెలిచినా భారత జట్టు విజయం ఖరారవుతుంది.

1964 తర్వాత పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న భారత జట్టుకు ఈసారీ ఎలాంటి పోటీ ఎదురుకాలేదు. తొలి సింగిల్స్‌లో ప్రపంచ 461వ ర్యాంకర్‌ రామ్‌కుమార్‌ 6–7 (3/7), 7–6 (7/4), 6–0తో సింగిల్స్‌లో ర్యాంక్‌లేని ఐజామ్‌ ఉల్‌ హఖ్‌ ఖురేïÙని ఓడించాడు. 2 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ 20 ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ఐజామ్‌ సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. రెండో సింగిల్స్‌లో శ్రీరామ్‌ బాలాజీ 7–5, 6–3తో అకీల్‌ ఖాన్‌పై గెలిచాడు.

ఏటీపీ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో వీరిద్దరికీ ర్యాంక్‌ లేకపోవడం గమనార్హం. 75 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీరామ్‌ బాలాజీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు అకీల్‌ ఖాన్‌ సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు. నేడు జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో బర్కతుల్లా–ముజమ్మిల్‌ ముర్తజాలతో సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ తలపడతారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement