
రొసారియో (అర్జెంటీనా): నాలుగు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన యువ భారత్... ఆతిథ్య అర్జెంటీనాతో జరిగిన హోరాహోరీ పోరులో షూటౌట్‌లో విజయం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు 1–1 గోల్స్‌తో సమం కాగా... అనంతరం విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన షూటౌట్‌లో భారత్ 2–0తో గెలుపొందింది.
మ్యాచ్‌లో భారత్ తరఫున కనిక (44వ నిమిషంలో) ఏకైక గోల్ చేయగా... అర్జెంటీనా తరఫున మిలాగ్రోస్ డెల్ వాలె (10వ నిమిషంలో) ఒక గోల్ చేసింది. అర్జెంటీనా జట్టు తొలి క్వార్టర్‌లోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లగా... మూడో క్వార్టర్‌లో కనిక గోల్‌తో భారత్ స్కోర్లు సమం చేయగలిగింది. షూటౌట్‌లో భారత్ తరఫున లాల్‌రిన్‌పుయి, లాల్‌థన్‌ట్లుంగి విజయవంతం అయ్యారు.
యువ భారత జట్టు కెప్టెన్ నిధి గోల్‌కీపర్‌గా అర్జెంటీనా ప్లేయర్ల దాడులను సమర్థవంతంగా అడ్డుకోవడంతో భారర్లీ టోర్నమెంట్‌లో వరుసగా మూడో విజయం నమోదు చేసుకుంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం చిలీతో భారత్ తలపడుతుంది.