
ఆసియా డబుల్స్ స్క్వాష్ టోర్నీలో మూడు స్వర్ణాలు సొంతం
కౌలాలంపూర్: తుది పోరులో అదరగొట్టిన భారత స్క్వాష్ క్రీడాకారులు ఆసియా డబుల్స్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో క్లీన్‌స్వీప్ చేశారు. ఫైనల్ చేరిన మూడు విభాగాల్లోనూ విజేతగా నిలిచి మూడు స్వర్ణ పతకాలతో మెరిశారు. పురుషుల డబుల్స్‌లో అభయ్ సింగ్–వెలవన్ సెంథిల్ కుమార్ జోడీ... మహిళల డబుల్స్‌లో అనాహత్ సింగ్–జోష్నా చినప్ప ద్వయం... మిక్స్‌డ్ డబుల్స్ లో అభయ్ సింగ్–అనాహత్ సింగ్ జంట పసిడి పతకాలను సొంతం చేసుకున్నాయి.
పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అభయ్–సెంథిల్ జోడీ 9–11, 11–5, 11–5తో నూర్ జమాన్–నాసిర్ ఇక్బాల్ (పాకిస్తాన్) జంటను ఓడించింది. మహిళల డబుల్స్ తుది పోరులో అనాహత్–జోష్నా ద్వయం 8–11, 11–9, 11–10తో ఐనా అమాని–జిన్ యింగ్ యీ (మలేసియా) జోడీపై విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ సమరంలో అభయ్–అనాహత్ జంట 11–9, 11–7తో రాచెల్ అర్నాల్డ్–అమీòÙన్‌రాజ్ చందరన్ (మలేసియా) ద్వయంపై గెలుపొందింది.