
తమకంటే మెరుగైన ర్యాంక్ ఆటగాళ్లను ఓడించిన భారత షట్లర్లు
ప్రపంచ 9వ ర్యాంకర్‌పై సతీశ్, 12వ ర్యాంకర్‌పై ప్రణయ్, 13వ ర్యాంకర్‌పై శ్రీకాంత్ విజయం
మహిళల సింగిల్స్‌లో ముగిసిన భారత్ పోరు
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు అదర గొట్టారు. తొలి రౌండ్‌లో నలుగురు భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, సతీశ్ కుమార్ కరుణాకరన్, ఆయుశ్ శెట్టి తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఈ సీజన్‌లో ఫామ్‌లో లేని ప్రపంచ మాజీ నంబర్‌వన్, ప్రస్తుత 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 23–21, 13–21, 21–11తో ప్రపంచ 13వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)ను ఓడించాడు.
మరో మ్యాచ్‌లో ప్రపంచ 35వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 21–17, 21–16తో ప్రపంచ 12వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)పై సంచలన విజయం సాధించాడు. ప్రపంచ 51వ ర్యాంకర్ సతీశ్ కుమార్ కరుణాకరన్ 21–13, 21–14తో ప్రపంచ 9వ ర్యాంకర్ చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ)ను కంగుతినిపించాడు. ప్రపంచ 41వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 20–22, 21–10, 21–8తో ప్రపంచ 30వ ర్యాంకర్ బ్రియాన్ యాంగ్ (కెనడా)పై గెలుపొందాడు.
అయితే భారత్‌కే చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్‌కు నిరాశ ఎదురైంది. ప్రియాన్షు 15–21, 17–21తో జియా హెంగ్ జేసన్ టెహ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో సతీశ్; యుషి టనాకా (జపాన్)తో ప్రణయ్; ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో శ్రీకాంత్; తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో ఆయుశ్ శెట్టి తలపడతారు.
సింధుకు నిరాశ
మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. బరిలో ఉన్న నలుగురు క్రీడాకారిణులు పీవీ సింధు, ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్, మాళవిక తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 16వ ర్యాంకర్ సింధు 11–21, 21–14, 15–21తో ప్రపంచ 26వ ర్యాంకర్ థుయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో ఉన్నతి 12–21, 20–22తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో, ఆకర్షి 9–21, 8–21తో పుత్రి కుసుమ వర్థిని (ఇండోనేసియా) చేతిలో, మాళవిక 21–19, 18–21, 8–21తో చియు పిన్ చియాన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యారు.
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 10–21, 14–21తో గువో జిన్ వా–చెన్ ఫాంగ్ హుయ్ (చైనా) జంట చేతిలో ఓడిపోగా... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–18, 15–21, 21–14తో అద్నాన్–సారి జమాల్ (ఇండోనేసియా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల డబుల్స్‌లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్–సాయిప్రతీక్; హరిహరన్–రూబన్ కుమార్ (భారత్) జోడీలు తొలి రౌండ్‌లోనే ఓడిపోయాయి.