
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
గువాహటి: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ క్రీడాకారులు టంకర తలశిల జ్ఞానదత్తు, కలగోట్ల వెన్నెల తొలి రౌండ్‌లో విజయాలు సాధించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 17 ఏళ్ల జ్ఞానదత్తు 5–15, 15–7, 15–7తో మిలాన్ మెస్టెర్‌హాజి (హంగేరి)పై... మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో వెన్నెల 15–1, 15–6తో సియోఫ్రా ఫ్లిన్ (ఐర్లాండ్)పై గెలుపొందారు. ‘నేను తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్నాను. దాంతో తొలి గేమ్‌లో కాస్త ఒత్తిడికి గురయ్యా. యూరోప్ ప్లేయర్‌తో రెండోసారి తలపడ్డా. దాంతో యూరోప్ ఆటగాళ్ల ఆటతీరును అర్ధం చేసుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా.
రెండో గేమ్ నుంచి నేను సహజశైలిలో ఆడి విజయాన్ని అందుకున్నా’ అని ఈ మెగా ఈవెంట్‌లో టీమ్ విభాగంలో తొలిసారి కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న జ్ఞానదత్తు వ్యాఖ్యానించాడు. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన కోడె విష్ణుకేదార్–మంచాల కీర్తి ద్వయం కూడా గెలుపు బోణీ కొట్టింది. తొలి రౌండ్‌లో విష్ణు–కీర్తి జోడీ 15–7, 15–8తో మొస్లెనా కొరామా–ఒబపోంబా అదుమింటా (ఘనా) జంటపై గెలిచింది.