
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్
గువాహటి: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో... భారత యువ షట్లర్ తన్వీ శర్మ అదరగొడుతోంది. 17 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించుతూ... ఈ టోర్నీలో పతకం ఖాయం చేసుకున్న ఈ 16 ఏళ్ల అమ్మాయి... ఇప్పుడు ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం టాప్ సీడ్ తన్వీ శర్మ 15–11, 15–9తో లియు సి యా (చైనా)పై విజయం సాధించింది.
తద్వారా భారత్ నుంచి ఈ టోర్నీ ఫైనల్‌కు చేరిన మూడో ప్లేయర్‌గా తన్వీ నిలిచింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి అపర్ణ పోపట్ (1996లో రజతం), సైనా నెహ్వల్ (2006లో రజతం, 2008లో స్వర్ణం) మాత్రమే పతకాలు గెలిచారు. నేడు జరగనున్న ఫైనల్లో రెండో సీడ్ అన్యాపత్ ఫిచిత్‌ఫోన్ (థాయ్‌లాండ్)తో తన్వీ అమీతుమీ తేల్చుకోనుంది. సెమీఫైనల్లో తన్వీకి ప్రత్యర్థి నుంచి పెద్దగా పోటీ ఎదురుకాలేదు.
తొలి గేమ్‌లో తన్వీ 7–3తో స్పష్టమైన ఆధిక్యం కనబర్చగా... కాస్త పోరాడిన ప్రత్యర్థి 7–8తో తన్వీని సమీపించింది. ఆ తర్వాత తప్పిదాలకు అవకాశం ఇవ్వని భారత షట్లర్... వరుస పాయింట్లతో విజృంభించింది. రెండో సెట్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
మరోవైపు డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట పరాజయం పాలైంది. శనివారం పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–23, 21–18, 16–21తో టకురో హోకి–యుగో (జపాన్) ద్వయం చేతిలో ఓడింది.