
133వ ర్యాంక్‌లో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమవుతోన్న భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ దిగజారింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఆరు స్థానాలు పడిపోయి 133వ ర్యాంక్‌లో నిలిచింది. గత తొమ్మిదేళ్లలో భారత్‌కిదే అత్యల్ప ర్యాంక్ కావడం గమనార్హం. ఈ ఏడాది జూన్ 4న థాయ్‌లాండ్‌తో జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత బృందం 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది.
ఆ తర్వాత ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో హాంకాంగ్ చేతిలో 0–1తో పరాజయం పాలైంది. భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో హెడ్ కోచ్ మనోలో తన పదవి నుంచి వైదొలిగాడు. 2016 డిసెంబర్‌లో భారత జట్టు అత్యల్పంగా 135వ ర్యాంక్‌లో నిలువగా... 1996 ఫిబ్రవరిలో అత్యుత్తమంగా 94వ స్థానాన్ని దక్కించుకుంది.
1113.22 రేటింగ్ పాయింట్లతో భారత జట్టు ఆసియాలో 24వ స్థానంలో ఉంది. 210 దేశాలు ఉన్న ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లండ్, బ్రెజిల్ జట్లు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.