
ఫైనల్లో భారత బాక్సర్లు
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా అండర్–15, అండర్–17 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం బౌట్‌లలో సత్తా చాటిన 14 మంది భారత బాక్సర్లు ఫైనల్‌కు దూసుకెళ్లారు. అండర్–15 బాలికల విభాగంలో 12 మందిలో 9 మంది భారత బాక్సర్లు తుదిపోరుకు అర్హత సాధించారు. పోటీల ఎనిమిదో రోజు బాలికల విభాగంలో కోమల్ (33 కేజీలు), నవ్య (58 కేజీలు), సునైనా (61 కేజీలు) ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యంతో రిఫరీ స్టాప్‌డ్ ద కాంటెస్ట్ (ఆర్‌ఎస్‌సీ) ద్వారా విజయం సాధించగా... ఖుషీ అహ్లావత్ (35 కేజీలు), తమన్నా (37 కేజీలు), ప్రిన్సీ (52 కేజీలు), తృష్ణ (67 కేజీలు) కూడా చక్కటి ప్రదర్శనతో గెలుపొందారు.
మిల్కీ మైనమ్ (43 కేజీలు) హోరాహోరీ సెమీస్‌లో 3–2తో నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. మరో ఇద్దరు బాక్సర్లు ‘బై’ ద్వారా ముందంజ వేశారు. బాలుర అండర్–15 విభాగంలో సంస్కార్ వినోద్ (35 కేజీలు) రిఫరీ స్టాప్‌డ్ ద కాంటెస్ట్ ద్వారా కిర్గిస్తాన్ బాక్సర్ అర్సెన్ జొరోబెవ్‌పై విజయం సాధించాడు. ఇతర బౌట్‌లలో రుద్రాక్ష్ (46 కేజీలు), అభిజీత్ (61 కేజీలు), లక్ష్య (64 కేజీలు) కూడా గెలిచి ఫైనల్‌కు చేరారు. ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తంగా భారత బాక్సర్లు 43 పతకాలు ఖాయం చేసుకున్నారు.