న్యూఢిల్లీ: భారత అత్యుత్తమ బాక్సర్లు పాల్గొంటున్న ‘ఎలైట్’ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ పోరులో పురుషుల, మహిళల విభాగాల్లో మన అత్యుత్తమ ఆటగాళ్లంతా పోటీ పడుతున్నారు. ఈ నెల 10 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో 10 వెయిట్ కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తారు.
మహిళల విభాగంలో మాజీ ప్రపంచ చాంపియన్, తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్, ప్రస్తుత వరల్డ్ చాంపియన్ జాస్మీన్ లంబోరియా, ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్, వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేతలు పూజ రాణి, పరీ్వన్, మాజీ ప్రపంచ చాంపియన్ నీతూ ఘంఘాస్, ఆసియా క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పన్వర్ బరిలోకి దిగుతున్నారు.
పురుషుల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత అమిత్ పంఘాల్, ఆసియా క్రీడల కాంస్యపతక విజేత నరేందర్ బెర్వాల్‌తో పాటు హితేశ్, సచిన్, అభినాశ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ టోరీ్నలో ప్రదర్శనను బట్టి ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే బాక్సర్లను ఎంపిక చేయనున్నారు. పతకాలు నెగ్గిన ప్లేయర్ల కోసం ప్రత్యేకంగా జాతీయ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తారు.


