నేడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టి20
జోరు మీదున్న సూర్య కుమార్ బృందం
ఫామ్‌లేమితో సఫారీల సమస్య
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత్ ఆ తర్వాత ఇప్పటి వరకు 32 టి20లు ఆడితే 26 గెలిచి, 4 మాత్రమే ఓడిపోయింది. ఇలాంటి అద్భుత ఫామ్ మాత్రమే కాదు జట్టులో అనూహ్య మార్పులేమీ లేకుండా చాలా కాలంగా ఒకే పటిష్టమైన బృందంతో సాగుతోంది. మరోవైపు భారత్ చేతిలో టి20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత దక్షిణాఫ్రికా 9, గెలిచి 16 ఓడిపోయింది.
పైగా నిలకడ లేని టీమ్‌తో పదే పదే మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. సొంతగడ్డపై తమ స్థాయిని ప్రదర్శించేందుకు టీమిండియా సిద్ధం కాగా... వచ్చే టి20 వరల్డ్ కప్‌కు ముందు ఇక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడటం సన్నాహకంగా ఉపయోగపడుతుందని సఫారీలు భావిస్తున్నారు.
కటక్: భారత గడ్డపై చాలా కాలం తర్వాత ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్‌లలో కూడా సిరీస్‌లు జరుగుతుండగా... టెస్టుల్లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. వన్డే సిరీస్ నెగ్గిన టీమిండియా ఇప్పుడు టి20 సిరీస్ విజయంపై గురి పెట్టింది. డిఫెండింగ్ చాంపియన్‌గా వరల్డ్ కప్ బరిలోకి దిగడానికి ముందు భారత్ 10 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్‌తో కూడా ఐదు టి20 మ్యాచ్‌లు ఉన్నాయి.
ఇప్పటికే సిద్ధమైన జట్టును అన్ని రకాలుగా పరీక్షించుకోవడంతో పాటు స్వల్ప లోపాలేమైనా ఉంటే సరిదిద్దుకునేందుకు ఈ మ్యాచ్‌లు అవకాశం కల్చిస్తాయి. మరోవైపు దక్షిణాఫ్రికా సిరీస్ ఫలితంకంటే కూడా తమ జట్టును పునరి్నరి్మంచుకోవటంపై దృష్టి పెట్టింది. ఇలాంటి సమీకరణాల మధ్య బారాబతి స్టేడియంలో నేడు తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది.
గిల్, పాండ్యా సిద్ధం...
ఆ్రస్టేలియా గడ్డపై టి20 సిరీస్ గెలిచిన తర్వాత భారత్ ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతోంది. సంచలన ఎంపికలు ఏమీ లేవు కాబట్టి తుది కూర్పుపై కూడా స్పష్టత ఉంది. గాయాల నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ గిల్, హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. కాబట్టి వీరిద్దరు ఆడటం ఖాయం.
అభిషేక్ శర్మతో పాటు గిల్ ఓపెనింగ్ చేయనుండగా సూర్య, తిలక్ వర్మ స్థానాలపై ఎలాంటి సందేహం లేదు. వికెట్ కీపర్‌గా సంజూ సామ్సన్, జితేశ్ శర్మలలో ఎవరికి అవకాశం ఇస్తారనేది చూడాలి. రెగ్యులర్ స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి ఉంటారు. అక్షర్ పటేల్‌తో పాటు ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ పోటీలో ఉన్నాడు. పేస్ ఆల్‌రౌండర్ కావాలంటే హర్షిత్ రాణాకు కూడా అవకాశం దక్కవచ్చు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ మాత్రమే కాస్త ఆందోళన కలిగిస్తోంది.
పూర్తి స్థాయిలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాతి నుంచి సూర్య ఆడిన 15 ఇన్నింగ్స్‌లలో 15.33 సగటుతో కేవలం 184 పరుగులే చేశాడు. అంతకుముందు నుంచి కలిపి చూస్తే గత 20 ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ చేయకుండా పూర్తిగా విఫలయ్యాడు. ప్రస్తుత స్థితిలో అతని స్థానానికి వచ్చిన ముప్పేమీ లేకున్నా... ఈ సిరీస్‌లోనైనా స్థాయికి తగినట్లుగా చెలరేగాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.
బ్రెవిస్‌పై దృష్టి...
దక్షిణాఫ్రికా టీమ్ పరిస్థితి ఇటీవల అంతంత మాత్రంగానే ఉంది. ఆ్రస్టేలియా, పాకిస్తాన్‌ల చేతిలో సిరీస్‌లు ఓడటంతో పాటు నమీబియా చేతిలో మ్యాచ్ కూడా కోల్పోయింది. పైగా ఇంగ్లండ్‌తో జరిగిన టి20లో 300కు పైగా పరుగులిచ్చి ఇలాంటి చెత్త రికార్డు నమోదు చేసిన పెద్ద జట్టుగా నిలిచింది.
దూకుడైన ఆటగాడు డేవిడ్ మిల్లర్, పేసర్ నోర్జే గాయాల నుంచి కోలుకొని పునరాగమనం చేయడం సానుకూలాంశం కాగా కెప్టెన్‌గా మళ్లీ బాధ్యతలు తీసుకున్న మార్క్‌రమ్ మెరుగైన ఫామ్‌లో ఉండటం కలిసి రావచ్చు.
ఇప్పటికీ తుది జట్టు విషయంలో టీమ్‌లో గందరగోళమే ఉంది. అయితే ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించగల డెవాల్డ్ బ్రెవిస్‌పై మాత్రం అందరి దృష్టీ ఉంది. ఐపీఎల్‌తో పాటు ఇటీవల వన్డేల్లో కూడా అతని దూకుడు కనిపించింది. బ్రెవిస్ చెలరేగితే సఫారీలకు మంచి గెలుపు అవకాశం ఉంటుంది. యాన్సెన్ ఆల్‌రౌండ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
పిచ్, వాతావరణం
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమంగా అనుకూలించే అవకాశం ఉన్న స్పోరి్టంగ్ పిచ్. ప్రతీ ఆటగాడు సత్తా చూపించేందుకు సరైంది. అయితే ఇక్కడా మంచు ప్రభావం చాలా ఉంది కాబట్టి టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన ఉన్నా మ్యాచ్‌కు ఇబ్బంది లేకపోవచ్చు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, గిల్, తిలక్, జితేశ్ శర్మ/సామ్సన్, పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, హర్షిత్/సుందర్.
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్ (కెప్టెన్), డికాక్, హెన్‌డ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, బాష్/లిండే, యాన్సెన్, మహరాజ్, ఎన్‌గిడి, మహరాజ్.


