మూడో టెస్ట్‌తో సరికొత్త చరిత్ర ఆవిష్కృతం

India vs England Test Match In Motera ground  - Sakshi

టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైన మొటెరా మైదానం

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా గుర్తింపు

భారత్, ఇంగ్లండ్‌ మధ్య బుధవారంనుంచి జరిగే మూడో టెస్టు మ్యాచ్‌తో ఒక కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. క్రికెట్‌ ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా గుర్తింపు తెచ్చుకున్న మొటెరా మైదానం తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటివరకు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో ప్రత్యక్షంగా మ్యాచ్‌ చూడటాన్ని ప్రేక్షకులు ఒక  అదృష్టంగా భావిస్తుండగా, ఇప్పుడు భారత అభిమానులకు కూడా మన ‘ఎంసీజీ’లో అలాంటి ‘లక్ష’ణమైన అవకాశం దక్కనుంది. పైగా ఈ టెస్టు మ్యాచ్‌ పింక్‌ బంతులతో జరిగే డే అండ్‌ నైట్‌ టెస్టు కావడంతో మైదానం మరింత వెలుగులు విరజిమ్మనుంది.

సాక్షి క్రీడా విభాగం
‘సర్దార్‌ పటేల్‌ స్టేడియం’గా కూడా పిలిచే మొటెరా మైదానంలో 1983 నవంబర్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ జరిగింది. సునీల్‌ గావస్కర్‌ 10 వేల పరుగుల మైలురాయిని దాటడం, రిచర్డ్‌ హ్యాడ్లీ రికార్డును అధిగమిస్తూ కపిల్‌దేవ్‌ తన 432వ వికెట్‌ను పడగొట్టడం వంటి చిరస్మరణీయ ఘట్టాలకు ఈ మైదానం వేదికైంది. 2006 చాంపియన్స్‌ ట్రోఫీ సమయంలో పలు మార్పులతో దీనిని ఆధునీకరించారు. 2011 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌కు వేదికైన ఈ గ్రౌండ్‌లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ 2012 డిసెంబర్‌లో జరిగింది. 2015లో దీనిని పూర్తిగా పునాదులనుంచి కూలగొట్టి కొత్త స్టేడియం నిర్మించాలని సంకల్పించారు. 2017 జనవరిలో నిర్మాణం ప్రారంభమైన అనంతరం సరిగ్గా మూడేళ్ల తర్వాత స్టేడియం సిద్ధమైంది. గత ఏడాది ‘నమస్తే ట్రంప్‌’ ఈవెంట్‌ ఇక్కడే జరగ్గా, ఇటీవల ముస్తాక్‌ అలీ ట్రోఫీ నాకౌట్‌ మ్యాచ్‌లతో తొలిసారి క్రికెట్‌ పోటీలకు గ్రౌండ్‌ ఆతిథ్యమిచ్చింది. ఇప్పుడు తొలిసారి టెస్టు మ్యాచ్‌ కోసం సిద్ధమైంది.

మొటెరా స్టేడియం విశేషాలు చూస్తే..
► స్టేడియం సామర్థ్యం 1 లక్షా 10 వేలు  
► నిర్మాణ వ్యయం సుమారు రూ. 678 కోట్లు
► (ఎల్‌ అండ్‌ టీ సంస్థ)
► మొత్తం 63 ఎకరాల్లో విస్తరించి ఉంది
► అవుట్‌ ఫీల్డ్‌ పరిమాణం
► 180 గజాలు X 150 గజాలు
► 6 ఇండోర్, 3 అవుట్‌డోర్‌ ప్రాక్టీస్‌ పిచ్‌లు, జిమ్‌ సౌకర్యంతో కూడిన 4 డ్రెస్సింగ్‌ రూమ్‌లు   
► 40 మందికి వసతి కల్పిస్తూ
► ఇండోర్‌ క్రికెట్‌ అకాడమీ
► 76 కార్పొరేట్‌ బాక్స్‌లు  
► స్టేడియానికి ప్రత్యేక ఆకర్షణ ఎల్‌ఈడీ లైట్‌లు. ఇతర మైదానాల తరహాలో ఫ్లడ్‌ లైట్లు వాడకుండా పైకప్పు కింది భాగంనుంచి వరుసగా లైట్లను అమర్చారు.  
► ప్రేక్షకులకు అన్ని వైపులనుంచి స్పష్టమైన ‘వ్యూ’ ఉండే విధంగా ఇంత పెద్ద మైదానంలో ఒక్క పిల్లర్‌ కూడా లేకుండా కొత్త టెక్నాలజీతో నిర్మించడం విశేషం.
► ప్రధాన గ్రౌండ్‌లో 11 పిచ్‌లు ఉన్నాయి.  
► 8 సెంటీమీటర్ల వర్షం కురిసినా వెంటనే ఆట కోసం సిద్ధం చేసే అధునాతన డ్రైనేజీ వ్యవస్థ  
► ఒకేసారి స్టేడియం పరిసరాల్లో కనీసం 60 వేల మంది స్వేచ్ఛగా తిరగగలిగే విధంగా ప్రత్యేక ర్యాంప్‌లు ఏర్పాటు చేశారు.  
► 3 వేల కార్లు, 10 వేల ద్విచక్రవాహనాల పార్కింగ్‌ సౌకర్యం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top