Ind Vs Eng: వైజాగ్‌ టెస్టుకు భారీ ఏర్పాట్లు.. | India Vs England 2nd Test All Arangements Are Complete, Check All The Details Inside - Sakshi
Sakshi News home page

IND vs ENG 2nd Test: వైజాగ్‌ టెస్టుకు భారీ ఏర్పాట్లు.. ఫోన్‌లో టికెట్‌ చూపిస్తే చాలు

Published Thu, Feb 1 2024 8:09 AM

India vs England 2nd Test All arrangements are complete - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: పీఎంపాలెంలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ముచ్చటగా మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది. ఇక్కడ తొలిసారిగా ఇంగ్లండ్‌ జట్టు టెస్ట్‌ మ్యాచ్‌ ఆడగా.. మరోసారి ఆడేందుకు ఆ దేశ జట్టు వచ్చింది. ఆతిథ్య జట్టుకు అచ్చొచ్చిన స్టేడియంగా పేరొందిన ఈ స్టేడియంలో 2016లో ఇంగ్లండ్‌తో, 2019లో దక్షిణాఫ్రికాతో ఆడి విజయాలను సొంతం చేసుకుంది.

ఆయా సిరీస్‌ల్లో తొలి విజయాలతో చక్కటి ఆరంభాన్ని వైఎస్సార్‌ స్టేడి యం ఇచ్చింది. కాగా.. ఇంగ్లండ్‌ మ్యాచ్‌ అనగానే ఆ దేశం నుంచి మ్యాచ్‌ను తిలకించేందుకు భారీగా అభిమానులు తరలివస్తారు. టూ టైర్‌ సిటింగ్‌ ఏర్పాట్లు ఉన్న స్టేడియంలో సౌత్‌, నార్త్‌ బ్లాక్‌ల్లో అభిమానులకు అనుమతిస్తున్నారు.

విద్యార్థులు, క్రికెట్‌ క్లబ్‌ల తరఫున ఆడే ఔత్సాహికులకు ఏసీఏ ఉచితంగానే టికెట్లను అందించే ఏర్పాట్లు చేసింది. ఇంగ్లండ్‌ అభిమానుల భద్రత, మ్యాచ్‌ నిర్వహణ, ఏర్పాట్లు, టికెట్ల విక్రయాలు తదితర అంశాలను ఎస్‌ఆర్‌ గోపీనాథ్‌రెడ్డి బుధవారం ‘సాక్షి’కి వివరించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..

ఇంగ్లండ్‌ అభిమానులకు ప్రత్యేక భద్రత
వైఎస్సార్‌ స్టేడియంలో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు ఇంగ్లండ్‌ అభిమానులు ఏకంగా మూడు బాక్స్‌ల టికెట్లను కొనుగోలు చేశారు. వారి భద్రతకు బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ రిక్కీ నిర్వహించి ఏర్పాట్లు సమీక్షించనున్నారు.

వీరంతా వివిధ ప్రాంతాల్లో హోటళ్లను బుక్‌ చేసుకున్నారు. స్టేడియంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశాం. ఎండను తట్టుకునేందుకు వీలుగా సన్‌స్క్రీన్‌ లోషన్‌ను వారి వెంట తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించాం.

మెరుగ్గా పారిశుధ్య నిర్వహణ
స్టేడియంలో కొత్తగా కమోడ్‌లు ఏర్పాటు చేశాం. డ్రైనేజ్‌ను ఆధునికీకరించాం. మ్యాచ్‌ జరిగేప్పుడు పారిశుధ్య నిర్వహణ కోసం బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థకు అప్పగించాం. ఇందుకోసం ఓ అప్లికేషన్‌ రూపొందించాం. స్టేడియంలో ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి పరిశుభ్రత జరుగుతుందనే విషయాన్ని పర్యవేక్షిస్తాం. మ్యాట్స్‌, టైల్స్‌ తదితరాలను శుభ్రంగా ఉంచే ఏర్పాట్లు జరిగాయి.

ఫోన్‌లో టికెట్‌ చూపిస్తే చాలు
దేశంలోనే తొలిసారిగా డిజిటల్‌ టికెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం. కొనుగోలు చేసిన టికెట్‌ ను ఫోన్‌లో చూపించి ప్రవేశం పొందవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారు టికెట్‌ కోసం స్టేడియానికి రావాల్సిన అవసరం లేదు. లైన్‌లో వేచి ఉండక్కర్లేదు. దీనివల్ల పేపర్‌ను సేవ్‌ చేయవచ్చు.

ఇటీవల జరిగిన టీ–20 మ్యాచ్‌కు ఈ విధానాన్ని అమలు చేద్దామని భావించాం. అయితే ట్రయల్‌రన్‌ నిర్వహిస్తే బాగుంటుందని ఇప్పుడు అమలు చేస్తున్నాం. లోటుపాట్లు ఉంటే సవరించుకుని.. సక్సెస్‌ అయితే ఇక డిజిటల్‌ టికెటింగ్‌కే ప్రాధాన్యమిస్తాం.

20 వేల టికెట్ల విక్రయం
టెస్ట్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆన్‌లైన్‌లో 15 వేల టికెట్లు, కౌంటర్ల ద్వారా 5వేల టికెట్లు అమ్ముడుపోయాయి. స్టేడియం వద్ద ఆట చివరి రోజు వరకు కౌంటర్‌ ద్వారా టికెట్లను విక్రయించనున్నాం. శని, ఆదివారాల్లో అధిక సంఖ్యలో అభిమానులు రావచ్చని అంచనా వేస్తున్నాం. అభిమానులు తమ వాహనాలను కల్యాణ్‌కుమార్‌ పార్కింగ్‌ లేఅవుట్‌, బీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్థలంలో పార్కింగ్‌ చేసుకోవాలి. ఉచితంగా మంచినీటిని అందిస్తాం. స్టేడియంలో ఫుడ్‌స్టాళ్లు అందుబాటులో ఉంటాయి. స్టేడియంలోకి ఎలాంటి తినుబండారాలను అనుతించం. ఉదయం ఎనిమిది నుంచే స్టేడియంలోకి అనుమతిస్తాం. రోజుకు టికెట్‌ ధర కనీసం రూ.100 నుంచి గరిష్ట ధర రూ.500గా నిర్ణయించినట్లు గోపీనాథ్‌రెడ్డి వివరించారు.

Advertisement
 
Advertisement