
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) భారత్ (Team India) విజేతగా నిలిచింది. నిన్న (సెప్టెంబర్ 28) జరిగిన ఫైనల్లో పాక్‌ను ఓడించి 9వ సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ దాదాపు 20 రోజుల పాటు సాగింది. భారత్ ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా నిలిచింది.
గ్రూప్ దశలో యూఏఈ, పాకిస్తాన్, ఒమన్‌పై విజయాలు సాధించిన టీమిండియా.. సూపర్-4లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకపై గెలుపొందింది. ఫైనల్లో మరోసారి పాక్‌పై గెలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ టోర్నీలో భారత్‌కు శ్రీలంక ఒక్కటే కాస్త టఫ్ ఫైట్ ఇచ్చింది. పాక్‌తో తలపడిన మూడు సందర్భాల్లో టీమిండియాదే పైచేయిగా నిలిచింది.
ఆసియా కప్ అనంతరం టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో (India vs West Indies) రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఆసియా కప్ తర్వాత కేవలం 3 రోజుల గ్యాప్‌లోనే భారత్, వెస్టిండీస్‌తో తలపడనుంది. అక్టోబర్ 2 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి టెస్ట్ జరుగనుంది. అనంతరం అక్టోబర్ 10 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో రెండో టెస్ట్ జరుగుతుంది.
ఈ సిరీస్ కోసం ఇరు జట్లను ఇదివరకే ప్రకటించారు. భారత జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. విండీస్‌కు రోస్టన్ ఛేజ్ సారథ్యం వహిస్తాడు. ఈ సిరీస్‌కు ఇంగ్లండ్‌లో గాయపడ్డ భారత రెగ్యులర్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో ధృవ్ జురెల్, ఎన్ జగదీసన్ వికెట్ కీపర్ బ్యాటర్లుగా ఎంపికయ్యారు.
కొత్తగా దేవ్‌దత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు. కరుణ్ నాయర్ స్థానాన్ని అతను భర్తీ చేయనున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా గాయపడిన నితీశ్ కుమార్ రెడ్డి ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. విండీస్ జట్టులో ఎక్కువ శాతం కొత్త ముఖాలు ఉన్నాయి. బ్యాటింగ్‌లో షాయ్ హోప్, బౌలింగ్‌లో అల్జరీ జోసఫ్ మాత్రమే కాస్త అనుభవజ్ఞులు.
ఈ సిరీస్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. జియో హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్‌కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్
వెస్టిండీస్: రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, తేజ్‌నరైన్ చంద్రపాల్, జాన్ క్యాంప్‌బెల్, జోహన్ లేన్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్, అల్జరీ జోసఫ్, జేడన్ సీల్స్, ఖారీ పియెర్
చదవండి: Asia Cup 2025: సూర్యకుమార్ యాదవ్ చేశాడని పాకిస్తాన్ కెప్టెన్ కూడా..!