
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
సాలో (ఇండోనేసియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి పోరులో శ్రీలంకపై గెలుపొందిన భారత జట్టు... శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై విజయం సాధించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో భారత్ 110–83 పాయింట్ల తేడాతో యూఏఈని చిత్తుచేసింది. భారత్ తరఫున తొలి మ్యాచ్ మహిళల సింగిల్స్‌లో రుజులా 11–5తో మైసా ఖాన్‌పై గెలుపొందింది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో లాల్‌రమ్‌సంగా–తరిణి జంట 11–6తో యూఏఈ జోడీపై నెగ్గింది. తన్వీ శర్మ, రిషిక కూడా విజయాలు సాధించడంతో భారత జట్టు సునాయాసంగా గెలుపొందింది. ఇదే గ్రూప్‌లో ఉన్న హాంకాంగ్ కూడా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి నాకౌట్ దశకు చేరింది. ఇక ఆదివారం జరగనున్న పోరులో హాంకాంగ్‌తో భారత్ తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్ ‘డి’ టాపర్‌గా నిలవనుంది. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ అత్యుత్తమంగా 2011లో కాంస్య పతకం నెగ్గింది. ఆ తర్వాత మరోసారి పతకం సాధించలేకపోయింది. గతేడాది క్వార్టర్ ఫైనల్లో మలేసియా చేతిలో ఓడి రిక్త హస్తాలతో వెనుదిరిగింది. మొత్తం 17 జట్లు పాల్గొంటున్న ఈ టోరీ్నలో సెమీఫైనల్‌కు చేరితే పతకం ఖాయం కానుంది.